స్థానిక ఎన్నికల వేడి ప్రతిపక్షంలోనే కాదు.. అధికార వైకాపాలోనూ కాక రేపుతోంది. తాము కోరిన వారికి అధిష్టానం బీ ఫారం ఇవ్వకపోవడంతో అలకలు బూనుతున్నారు. మరొకరైతే అజ్ఞాతం బాట కూడా పట్టారు. స్థానిక ఎన్నికల సమయంలో కార్యకర్తలకు అందుబాటులోకి రాకుండా ఆందోళన కల్గించారు. చివరికి అధిష్టానం బుజ్జగింపులతో మీడియా ముందుకు వచ్చారు.
విషయం ఏమిటంటే.. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన తనయుడికి బీఫారం దక్క లేదనే బాధతోనే పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయారట. పైగా చిట్టిబాబు బీఫారాలు పంపిన నేతలకు కాకుండా అధిష్టానం వేరే వారికి బీఫారాలు పంపింది. దీంతో మనస్తాపానికి గురైన చిట్టిబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను కూడా ఆందోళన పడేలా చేశారు.
చివరికి జిల్లా ఇంచార్జ్ మంత్రులు, సీనియర్ నేతలు బుజ్జగించేసరికి అజ్ఞాతం వీడిన చిట్టిబాబు మీడియా ముందుకు వచ్చినట్లు టాక్. మీడియా ముందుకు అయితే వచ్చాడు గానీ.. తాను ఎంపిక చేసిన వాళ్లలో కేవలం ఒక్కరికి మాత్రమే అధిష్టానం బీఫారం ఇవ్వడంతో మిగిలిన వారి ముందు, తాను మాట ఇచ్చిన వారి ముందు తనకు గౌరవం లేకుండా పోయిందని ఆయన ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. చిట్టిబాబులాగానే మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఎదురు చెప్పలేక, తాము కోరుకున్న వారికి సీట్లు ఇప్పించుకోలేక ఇబ్బంది పడుతున్నారట. ఈ అసంతృప్తులు ఎక్కడిదాకా వెళ్తాయో…!