రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీలో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రముఖ నేతలు ఒకరి తర్వాత ఒకరు టీడీపీని వదిలి వెళ్లిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ టీడీపీపై, బాబుపై విమర్శలు కూడా చేసిపోతున్నారు.
టిడిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడుగా వ్యవహరించిన రెహమాన్ గత ఏడాది డిసెంబర్ 26న టీడీపీకి రాజీనామా చేశారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా ఇప్పుడు టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొంటూ లేఖ కూడా రాశారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని బాబుకు షాక్ ఇచ్చారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైకిల్ దిగేందుకు సిద్ధమయ్యారట. వైసీపీలో ఆయన చేరబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రామసుబ్బారెడ్డి రాకను వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నప్పటికీ జగన్ నిర్ణయం తీసుకోవడంతో
ఆయన మౌనంగా ఉండిపోయారని సమాచారం.
అలాగే అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ రాజశేఖర ఆచారితో పాటు మరి కొందరు కౌన్సిలర్లు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు వారు తమ రాజీనామా లేఖలను అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా అందజేశారు. వీరంతా వైసీపీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో టీడీపీ ఎలా నిలదొక్కుకుంటుందో.. ఇతర నేతలను అయినా ఎలా కాపాడుకుంటుందో చూడాలి.