ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. నేటి నుంచి సీఎస్ నిర్ణయం మేరకు పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఆమలు చేసినట్లు ఆధారలను సైతం నివేదిక రూపంలో కోర్టుకు అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అధికార పార్టీ జెండా రంగులను పోలిన రంగులు వేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోనూ కూడా రద్దు చేసింది. గతంలోనూ ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హై కోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు వేయొద్దని సీరియస్‌గానే స్పందించింది.
త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల ప్రతిపక్షం హర్షం వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సైతం వైసీపీ రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.