విశాఖ విషాదాన్ని చప్పున చల్లార్చేసిన జగన్ 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం చిన్నదేమీ కాదు.  12 మంది మృత్యువాత పడగా అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు.  అసలే కరోనా వైరస్ కారణంగా విలవిలాడుతున్న తరుణంలో జరిగిన ఈ ఘటన దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేసింది.  ఈ పరిణామంతో ఇక రాజకీయాలు హీటెక్కడం, జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఒత్తిడి ఎక్కువ కావడం ఖాయనని అందరూ అనుకున్నారు.  కానీ అవేవీ జరగలేదు.. జరిగే ఛాన్స్ సీఎం వైఎస్ జగన్ ఇవ్వలేదు.  ఊహించని రీతిలో సమస్యను కొలిక్కి తెచ్చేశారు.  ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించిన జగన్ ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా చక చకా పరిష్కార చర్యలు చేపట్టారు. 
 
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుండి డిమాండ్ రాకముందే విశాఖ బయలుదేరిన జగన్ నేరుగా వెళ్లి భాధితుల్ని కలిసి ధైర్యం చెప్పారు.  నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.  ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో సంబంధం లేకుండా ఒక్కసారే కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.  అంతేకాదు సహాయాన్ని కేవలం ఐదంటే ఐదే రోజుల్లో భాధితులకు మంత్రుల చేతుల మీదుగా అందేలా చేశారు.  ఇంత పెద్ద పరిహారం ఇంత త్వరగా బాధితులకు అందడం ఇదే ప్రథమం అనొచ్చు.  అసలు వైఎస్ జగన్ అథికారంలోకి వచ్చిన తర్వాత ఒక సమస్య మీద ఇంత త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయటం ఇదే ప్రథమం.  
 
పరిహారం ప్రాణానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు కానీ జీవనాధారం కోల్పోయినవారికి మాత్రం భరోసాలా నిలుస్తుంది.  సీఎంలోని ఈ వేగం విష వాయువు వ్యాపించిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సానిటైజేషన్ తరహా పనులు చేపట్టడం భాధితులకు కూడా ఊరటనిచ్చాయి.  ఇక లాక్ డౌన్ నిబంధనల కారణంగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో ప్రభుత్వంపై విమర్శలు, వ్యతిరేక ప్రదర్శనలు అస్సలు జరిగే వీలు లేకుండా పోయింది.  బీజేపీ సైతం జగన్ స్పీడ్ చూసి ముక్కున వేలేసుకోగా జనసేన అధినేత పవన్ ఈ కష్ట కాలంలో ప్రభుత్వంపై విమర్శలు తగవని సైలెంట్ కావడంతో ఇంత పెద్ద గండాన్ని జగన్ పొలిటికల్ డ్యామెజీ లేకుండానే చాలా త్వరగా చల్లార్చేశారు.