విశాఖ వరుస ప్రమాదాల పై అనుమానాలు..!

Vizag Fire accident

ఏపీ పరిపాలన రాజధాని విశాఖలో జరుగుతున్న వరుస సంఘటనలు నగర వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. సాగర తీరాన సాఫీగా జీవనం గడిపే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలు మరువకముందే నిన్న రాత్రి రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ఈ వరుస ఘటనలకు అసలు కారణం ఏమై ఉంటుంది? మానవ తప్పిదమా లేక నిర్లక్ష్య వైఖరి అయి ఉంటుందా? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం అన్నట్టు ఏదైనా ప్రమాదం జరిగాకా ఆలోచించడం కంటే, ముందే ప్రమాదాలు జరగకుండా చూసుకుంటే బాగుటుందని ఓ పక్క చాలా మంది అభిప్రాయపడుతుంటే, మరోపక్క ఇలాంటి విషయాలపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టడంలేదని, సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఇలాంటి నేపద్యంలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఈ వరుస ఘటనలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సమగ్రంగా విచారణ జరపాలని సీఎం జగన్‌కి విజ్ణప్తి చేశారు. అయితే విశాఖకు రాజధాని రాకుండా చేయాలని చంద్రబాబు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నట్టు తనకు అనిపిస్తుందని, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బకొట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.