రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన తెర మీదకు తెచ్చింది. ఇందులో ఎవరి రాజకీయ విధానం వారికుంటుంది. ఈ ప్రతిపాదనను రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా కలిగే లాభ నష్టాలు ఆయా పార్టీలు భవిష్యత్తులో భరించక తప్పదు.
అయితే ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదన కొందరు మంత్రుల ప్రకటనలతో ప్రాంతాల మధ్య ద్వేషాలు పురికొల్పే విధంగా వున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ సెంటిమెంట్ బారిన పడేస్తున్నారు.
గురువారం రోజు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. శాంతి భద్రతల సమస్య ఎదురౌతుందని ముందుగా పోలీసు అధికారులు పసిగట్టలేకపోయారా?ముందుగా జాగ్రత్త పడి అసలు అనుమతే ఇవ్వకుంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు.
ఆ అంశం అటుంచగా ఈ సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ రాజధాని వద్దని చెప్పేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు వెంట వున్న ఉత్తరాంధ్ర టిడిపి నేతలు ద్రోహులుగా మిగిలి పోతారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారౌతారన్నారు. అంత వరకు బాగానే వుంది.
అయిదు ఏళ్లుగా రాజధానిగా వుంటూ కొన్ని వేల కోట్ల రూపాయల వ్యయం చేసిన అమరావతి నుండి విశాఖకు రాజధానిని వైసిపి ప్రభుత్వం మార్చితే అందుకు కోస్తా జిల్లాల వైసిపి నేతలు అంగీకరించితే మంత్రి బొత్స సత్యనారాయణ వాదన ప్రకారం ఈ ప్రాంతంలోని అధికార పార్టీ నేతలు అంతా ఇక్కడ ద్రోహులుగా మిగిలి పోక తప్పదు కదా? ఈ ప్రాంతంలో కొందరు వైసిపి నేతలపై ప్రజలను ఉసిగొల్పితే రాష్ట్ర భవిష్యత్తు ఏం కాను.? మంత్రులుగా వుండే వారే ఇలా మాట్లాడితే రాష్ట్రంలో శాంతి భద్రతల గతి ఏమౌతుంది? ప్రాంతాల మధ్య ఇలా చిచ్చు రేగి ఒక దఫా రాష్ట్రం రెండైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో జోక్యం చేసుకొని మంత్రులను అదుపు చేయకపోతే ప్రాంతీయ అసమానతలు నివారించబోయి ప్రాంతాల మధ్య ద్వేషాలు రగిల్చినవారౌతారు.