వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లే నలుగురు అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇద్దరు బీసీ నేతలకు సీట్లు ఇవ్వడం, పార్టీని నమ్ముకున్న వారిని రాజ్యసభకు పంపండం ద్వారా జగన్‌పై ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. గెలిచే బలం లేకపోయినా సరే సీనియర్ నేత వర్ల రామయ్యను అభ్యర్థిగా పోటీలో పెడుతున్నామని అధికారికంగా బాబు ప్రకటించారు.
అభ్యర్థిని ప్రకటించడమే కాదు.. ఓ అడుగు ముందుకేసి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించాలని బాబు సూచించారు. తప్పు, ఒప్పులు తెలుసుకని ఓటేయాలని హితవు పలుకుతున్నారు. వారు చేసేది తప్పని భావిస్తే.. వర్ల రామయ్యకు ఓటెయ్యాలని పలికారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలందరికి విప్ జారీ చేస్తారట బాబు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్‌కి చూపించి మరీ ఓటు వేయాలన్నారు. ఒకవేళ దీనిని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని కూడా పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు అల్టిమేట్టం జారీ చేశారు. మరి అన్నీ తెలిసి, గెలిచే బలం లేకపోయినా సరే చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.