రాజమౌళి గొప్ప దర్శకుడే కావొచ్చు, కానీ
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి అంశంపై మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి ప్రముఖ దర్శకుడు రాజమౌళిని టార్గెట్ చేసారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో దర్శకుడు రాజమౌళికి అమరావతి ఆర్కిటెక్చర్ రూపొందించే బాధ్యతలు అప్పగించడంపై బొత్స స్పందించారు.
బొత్స మాట్లాడుతూ…సినిమాల్లో రాజమౌళి చాలా గొప్పవాడు కావొచ్చు కానీ, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆయనకు తెలియదని అన్నారు. దర్శకత్వంలో దాసరి తర్వాత రాజమౌళేనని, అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి? రాష్ట్ర పరిస్థితులు ఏమిటి? అనే విషయాలు ఆయనకు తెలియవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాజమౌళి వ్యవహారం ఒకటని బొత్స పేర్కొన్నారు. కానీ, సీఎం జగన్ అలా కాదని, రాష్ట్రానికి ఏది అవసరమో అదే చేస్తున్నారని స్పష్టం చేశారు.
అంతేకాకుండా జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ చేస్తున్నవి పసలేని వ్యాఖ్యలని కొట్టిపారేశారు. పవన్ అనుభవ రాహిత్యానికి ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ పోలవరం రివర్స్ టెండరింగ్ అయ్యేవరకు ఆగాలని సూచించారు.
తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ అవినీతిపరులకు మద్దతుగా నిలుస్తున్నారని బొత్స విమర్శించారు. పవన్ ముఖ్యంగా ప్రశ్నించాల్సింది గత పాలకులను అని స్పష్టం చేశారు. చవకబారు ఉపన్యాసాలు, పెయిడ్ ఆర్టిస్టులతో కార్యక్రమాలు తమ వల్ల కాదని బొత్స వ్యాఖ్యానించారు. 100 రోజుల పాలనపై గెజిట్ విడుదల కోరడమే అవివేకం అని విమర్శించారు. రాజధాని నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నది వాస్తవం అని పునరుద్ఘాటించారు. తమ ప్రయత్నమంతా ఆ అవినీతిని వెలికితీసేందుకేనని స్పష్టం చేశారు.