రాజధాని అమరావతి పరిధిలోని మండలాల్లో భూములు కొనుగోలుపై విచారణ జరుగుతోంది. సిఐడి అధికారులు భూ అమ్మకాలు, కొనుగోళ్ళపై రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణలు చేస్తున్నారు. టిడిపి హయాంలో రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున చాలామంది భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు కూడా తమ ఇష్టారాజ్యంగా రైతుల నుండి భూములు కొనుగోలు చేసేశారంటూ వైసిపి నేతలు ఆధారాలతో సహా అసెంబ్లీలోనే ఆరోపించిన విషయం తెలిసిందే. సరే వైసిపి ఆరోపణలపై చంద్రబాబునాయుడుతో సహా మంత్రులు, టిడిపి నేతలు ఎదురుదాడులు చేశారు.
సరే ఆరోపణలు, ఎదురుదాడులు ఎలాగున్నా టిడిపిలోని కీలక నేతలు చాలామంది భారీగా భూములు కొన్నది వాస్తవమే. ముందుగా తన వాళ్ళంతా భూములు కొనుగోలు చేసేసిన తర్వాతే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. తర్వాత కూడా టిడిపి నేతలు రైతుల భూములను ఏదో ఓ పద్దతిలో లాగేసుకున్నారు.
అలాంటి లావాదేవీలపై ఇపుడు సిఐడి విచారణ మొదలుపెట్టింది. సిఐడి అధికారులు బృందాలుగా ఏర్పడి వెంకటయపాలెం, రాయపూడి, తుళ్ళూరు, నేలపాడు ప్రాంతాల్లో జరిగిన భూ అమ్మకాలు, కొనుగోళ్ళపై ఆరాలు తీస్తున్నారు. రాజధాని ప్రకటన తర్వాత జరీబు మెట్ట భూముల అమ్మకాలు ఎవరు చేశారు ? కొన్నదెవరు ? లాంటి వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ నుండి తీసుకుంటున్నారు.