విజయసాయిరెడ్డి.. సోషల్ మీడియాలో టీడీపీ నాయకులకు ముఖ్యంగా చంద్రబాబు గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా కామెంట్స్ చేయడంలో రెడ్డిగారు మాస్టర్ డిగ్రీ చేశారు. తాజాగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. ‘చంద్రబాబు గారూ.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203 పై మీ స్టాండ్ ఏమిటి.. అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. దీని పై మాట్లాడేందుకు మనసు రాలేదా.. మీరు రాయలసీమ బిడ్డేనా..?’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే విజయసాయిరెడ్డి మొన్నటి వరకూ కేసీఆర్-జగన్ ది తండ్రి, కొడుకుల అనుబంధం అన్నారు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కూడా తొలగిపోయాయి అన్నారు. పైగా ఇరు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపడుతున్నాయి అని కూడా విజయసాయి రెడ్డి పేలారు. మరి ఇప్పుడు ఏమైంది ? పరిస్థితులను బట్టి మాటలు మార్చడంలో తప్పు లేదనుకోవాలా ? లేక రాజకీయం అంటేనే విమర్శలు చేసుకోవటం అని సరిపుచ్చుకోవాలా ?
దీనికి తోడు టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న కూడా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గారి చేతిని ముద్దాడిన జగన్ గారు రాయలసీమ బిడ్డో, కాదో, అసలు జగన్ ఏపీకి చెందిన వ్యక్తో, కాదో తేల్చాలి సాయి రెడ్డి గారు అంటూ అయ్యన్న తన స్వామి భక్తిని చాటుకున్నాడు. ప్రస్తుత పరిస్థితులకు ఈ నాయకుల కామెంట్స్ కు సంబంధం ఉందా ? మాటల యుద్ధం చేసుకుంటే గాని ఈ నాయకులకు పొద్దు పొడవదా.. ఇప్పటికైనా పరిస్థుతులను బట్టి నాయకులూ ప్రవర్తిస్తే వారికే మంచింది.