డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దారుణంగా దాడి చేసి అవమానపరిచారని ఏపీ పోలీసుల పై ఇప్పటికే విమర్శలు ఎక్కువైయ్యాయి. ఇంతకీ ఇంతకుముందు డాక్టర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది ? ఆయన సస్పెండ్ అవకముందు కూడా పోలీసులు ఆరోపిస్తున్నట్లు ఇలాగే ఉండేవారా ? ఆయన పై దాడిలో పోలీసులు ఎలాంటి తప్పు చెయ్యలేదా.. ? ఒకటి మాత్రం చాల స్పష్టంగా తెలుస్తోంది. డాక్టర్ సస్పెండ్ కాకముందు ఆయన మానసిక స్థితి చాలా బాగుందని, ఆయన ప్రతిరోజూ సిన్సియర్ గా డ్యూటీకి వెళ్లేవారని తెలుస్తోంది.
మరి సుధాకర్ ను పోలీసులు ఎందుకు టార్గెట్ చేశారు ? అతను టీడీపీ మనిషి అనా… మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పినట్లు చేశాడనా ? అందుకే సస్పెన్షన్ ఆర్డర్ అతనికి ఇచ్చారా ? ఆలోచిస్తే ఇదే నిజమనిపిస్తోంది. కేవలం మాస్కులు లేవు అని ఆయన వీడియో చేశారు. దీనికి అయ్యన్న పాత్రుడికి సంబంధం ఏంటి ? ఒకవేళ, అయ్యన్న పాత్రుడు చెప్పినట్లే అతను ప్రభుత్వం పై ఆరోపణలు చేశాడు అనుకుందాం.. దానికి విచారణ జరపాలి కదా.. అతని ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకున్న తరువాత అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది.
అలాంటివి ఏమి లేకుండా అధికారం ఉంది కదా అని.. ఇష్టమొచ్చినట్టు ఉద్యోగం తొలిగిస్తారా.. పైగా పోలీసుల చేతే దాడి చేయిస్తారా ? దీనికి జగన్ ప్రభుత్వం సమాధానం ఆలోచించుకోవాలి. సుధాకర్ కి డాక్టర్ గా మంచి పేరు ఉందట, ఎన్నో అవార్డులు కూడా వచ్చాయట, అలాంటి వ్యక్తికి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడంతో చాలా డిస్టర్బ్ అయ్యి ఉంటాడు. అంతమాత్రాన అంతలోనే పిచ్చోడు అయిపోతాడా ? కేసు హైకోర్టులో ఉంది కాబట్టి సుధాకర్ కి న్యాయం జరుగుతుంది, అయితే ఆ లోపే జగన్ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇస్తే జగన్ కే మంచింది.