రాజ్యాంగ నిర్మాతలు పవిత్ర లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాజ్యసభను (పెద్దల సభ)క్రమేణా పారిశ్రామిక వేత్తలు వారి తైనాతీలు ఆక్రమించుకుంటున్నారు. పైగా ఆయా పార్టీలు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వ లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు వారు ఎవరైనా సరే తుదకు నేరస్తులకు కూడా రాజకీయ ఉపాధి కేంద్రంగా మార్చివేస్తున్నారు.ఈ అంశంలో అన్ని పార్టీలు అడ్డదారి తొక్కడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. వీరికి ప్రజల సమస్యలు తెలియవు. తెలిసినా పట్టవు. రాజ్యసభ సభ్యత్వం అడ్డుపెట్టుకొని తమ వ్యాపార లావాదేవీలు చక్కబెట్టుకోవడం లేదా తమ పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలు చక్క బెట్టడంలో వీరు తలమునకలుగా వుంటారు. గమనార్హమైన అంశమేమంటే తమను రాజ్యసభ పంపిన పార్టీ ఓడిపోతే వెంటనే పార్టీ ఫిరాయించడంలో ముందుంటారు.
ఆంధ్ర ప్రదేశ్ అంశానికొస్తే అటు టీడీపీ గాని ఇటు వైసిపి గాని గతంలో కొంత మేరకు కాంగ్రెస్ గాని రాజ్యసభకు పంపిన నేతలు ఎప్పుడూ ప్రజల మొహం చూచి ఎరుగరు. తుదకు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలుపొందే పరిస్థితి లేదు. కాని ధనబలంతో ఎక్కువ మంది రాజ్యసభకు ఎన్నికైనారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోగానే టిడిపి రాజ్యసభ సభ్యులుగా వుండిన కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేత్తలు గోడ దూకడం మనమెరుగుదుం.అదే విధంగా శాసన మండలిలో ఈ కథ నడుస్తోంది. ఇంతకీ ఇంత ఎందుకు చెప్ప వలసి వస్తున్నదంటే రేపు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ నుండి వున్న నాలుగు స్థానాలు దక్కించుకొనేందుకు తంటాలు పడుతున్నట్లు ప్రచారంలో వున్న అభ్యర్థులు ఎప్పుడైనా ప్రజల మొహం చూచి ఎరుగరు. ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేయ పని లేదు. కాని పట్టించు కున్న దాఖలా లేదు.
ఇందులో కొందరు కాంట్రాక్టర్లు అయితే మరికొందరు పారిశ్రామిక వేత్తలుగా లేదా పార్టీ ఫిరాయించిన వారుగా ఈలాంటి తరహా వారు తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సంవత్సరాలు శ్రమటోడ్చి అధికారంలోని కొచ్చిన సమయంలో అడుగులో అడుగు వేసిన వారు తక్కువ మందే. గతంలో చంద్రబాబు నాయుడు కూడా పార్టీలో పని చేసిన వారికి కాకుండా డబ్బున్న వారికి సభ్యత్వాలు ఇచ్చి ఫలితం అనుభవిస్తున్నారు.ఎంత వరకు నిజమో ఏమో గాని ఆంధ్రప్రదేశ్ కు చెంది మరో ముఖం తెరమీదకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారు. అంత వరకు బాగానే వుంది. అంబానీ ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే కొంత మేరకు ఉపాధి కలుగు తుంది. కాని అంబానీ వెంబడి రేపు ఏప్రిల్ నెలలో రాజ్యసభ సభ్యత్వం ముగిసే పరిమళ్ ధీరజ్ లాల్ సత్వానీ వెంట రావడంతో రాజ్యసభ సభ్యత్వం కోసమే అంబానీ వెంట వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఇదే నిజమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు తొక్కిన దారి వెంబడే నడిచిన వారైతారు. పైగా ఇప్పటికే ప్రచారంలో వున్న వారి లిస్ట్ ఇదే తరహాలో వుండటం మరో విశేషం.