దిశా చట్టానికి కేంద్రం అడ్డుపుల్ల! నిర్భయ ఉండగా దిశ ఎందుకు అంటూ..?

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2020.. చట్టంగా మారుతుందా? లేక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ పథకంలానే కొనసాగనుందా? నిర్భయ ఉండగా మళ్లీ కొత్తగా ఈ దిశ చట్టం ఎందుకు అని కేంద్రం అడ్డుపుల్ల వేస్తోందా..? మార్పులూ.. చేర్పులు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షలు పెడుతోందా?

తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన తర్వాత ముందుగా స్పందించింది ఏపీ ప్రభుత్వమే. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులను ఆపేందుకు, అలా పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా దిశా చట్టాన్ని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమేక మంది ప్రశంసలు అందుకుంది. ఈ చట్టాన్ని అమలుకు చేసేందుకు ప్రభుత్వం దిశ బిల్లు-2019ని కేంద్రానికి పంపిన విషయం విధితమే.

అయితే దిశ బిల్లును కేంద్రం వెనక్కు తిప్పి పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి తిరిగి పంపాలని సూచించింది. కేంద్రం చెప్పిన సవరణల్ని సరిచేసి తిరిగి బిల్లు పంపినా సరే కేంద్రం నుండి ఇప్పటి వరకు సరైన స్పందన లేదని తెలుస్తోంది. పైగా దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్రానికి వివరించినా సరే ఫలితం కలబడలేదని టాక్. పైగా నిర్భయ వంటి చట్టం ఉండగా మళ్లీ దిశ వంటివి ఎందుకు అని కేంద్రం సాగదీస్తోందట.

కేంద్రం అడ్డు చెప్పినా సరే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఎలాగైనా అమలు చేయాలని చూస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి అనుమతి రాకపోతే ఓ ప్రభుత్వ ప్రత్యేక పథకంగానైనా అమలు చేసేందుకు సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. అందులో భాగంగానే దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తోందని, విస్తృత ప్రచారం జరుగుతోంది. ఓ వైపు దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూనే మరోవైపు ఎలాగైనా కేంద్రానికి నచ్చజెప్పి దిశను చట్టంగానే చేయాలని జగన్ ప్రభుత్వం పట్టుదలగా ఉందట. మరి కేంద్రంను ఒప్పించి ‘దిశ’ను చట్టంగా చేస్తుందా..? లేక పథకంగానే కొనసాగిస్తుందా అన్నది తెలియాలంటే చాలా సమయమే పట్టేట్టుంది.