దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందు జాగ్రత్తలు చేపట్టింది. సాధారణం కన్నా ఎక్కువ శరీర ఉష్ణోగ్రతతో బాధపడుతున్నవారిని అనుమతించే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారిని గుర్తించేందుకు టీటీడీ థర్మల్ గన్ లను అందుబాటులోకి తెచ్చింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిని పరీక్షించిన తర్వాతే తిరుమల కొండపైకి అనుమతించనుంది. అలాగే ఎన్నారైలు, విదేశీయులపై పలు ఆంక్షలను విధించింది. ఇండియాకు వచ్చిన 28 రోజుల తర్వాతే తిరుమలకు రావాలని స్పష్టం చేసింది.
దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఒక వేళ ఎవరైనా కరోనా లక్షణాలున్న వారు తిరుమలకు వస్తే.. జనసందోహం ఎక్కువగా ఉంటుంది కనుక వైరస్ వ్యాప్తి ఎక్కువ స్థాయిలో ఉంటుందని, దాన్ని నివారించేందుకే టీటీడీ ఈ చర్యలు చేపట్టింది.