టీఆర్‌ఎస్‌లో ముదురుతున్న టిక్కెట్ల లొల్లి

టీఆర్‌ఎస్ లో ఎన్నికల వేడి మొదలైంది. అనేక నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి నేతలు వచ్చి టీఆర్ ఎస్ లో చేరడం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఓ వైపు ముందస్తు ఎన్నికలు అంటూ మరొవైపు సిట్టింగ్ లకే అవకాశాలు అంటుండడంతో టీఆర్ఎస్ క్యాడర్ లో ఆందోళన ఏర్పడింది. అనేక నియోజకవర్గాల్లో వివిధ పార్ఠీలలోని ప్రధాన నేతలంతా టీఆర్ఎస్ లో చేరడంతో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం వారి మధ్య ఇంటర్నల్ వార్ ప్రారంభమయ్యింది. అన్నింటికి ఆచితూచి అడుగు వేసే గులాబీ బాస్ టిక్కెట్ల పంచాయతీతో డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఈ టిక్కెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరుతుంది. ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నారు. అయితే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరారు. ఎర్రబెల్లి ప్రదీప్,నన్నపనేని నరేందర్ లు కూడా టీఆర్ ఎస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే కొండా సురేఖ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ పై ఆందోళనగా ఉన్నారు. ముగ్గురు నేతల మధ్య పోటీతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అందుకే అనేక సమావేశాల్లో సొంత పార్టీ నేతలపైనే ఆమె ఘాటు విమర్శలు చేస్తున్నారని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారు.

 

ఇక మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా టిక్కెటు దక్కుతుందో లేదో అని డైలమాలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత నుంచి ఆయనకు ప్రధాన పోటీ ఉంది. ఆమెతో పాటు మరికొంత మంది నేతలు కూడా మహబూబాబాద్ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆది నుంచి కూడా శంకర్ నాయక్ వివాదాస్పదునిగానే పేరుగాంచాడు. మహిళా కలెక్టర్‌ను తాకడం, సమావేశాలలో ఇష్టమొచ్చినట్టు రాయడానికి కూడా వీలులేని భాషల్లో మాట్లాడడంతో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్య సొంత  పార్టీ నేతలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది టిక్కెట్ల కోసం చిత్తకార్తె కుక్కల్లాగా తిరుగుతున్నారని సొంత పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో మహబూబాబాద్ నాయకులు శంకర్ నాయక్ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే యోచనలో ఉన్నారు.

 

నాగరుకర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి కూడా ఈ విధంగానే తయారైంది. అక్కడ సిట్టింగ్ గా ఉన్న ఎమ్మెల్యే బాలరాజుకు టీడీపీ నుంచి  టీఆర్ ఎస్ లోకి వచ్చిన మాజీ మంత్రి గువ్వల రాములుతో పోటీ ఏర్పడింది. గువ్వల రాములుపై చిర్రుబొర్రుగా ఉన్న బాలరాజు రాములుపై, అతని అనుచరులపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

 

ఇక అలంపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్ ఉన్నారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం కుమారుడు శ్రీనాధ్ పోటీ చేసి సంపత్ చేతిలో ఓడిపోయారు. టీడీపీ నేత అబ్రహాం టీఆర్‌ఎస్ లో చేరడంతో మంద శ్రీనాథ్ కాస్త గందరగోళంలో ఉన్నారు. అబ్రహం ఇప్పటికే టీఆర్ ఎస్ టిక్కెట్ తనకేనని ప్రచారం చేసుకోవటంతో మందా జగన్నాథం అబ్రహం పై ఆగ్రహం తో ఉన్నారు. ఈ సారీ ఎలాగైనా కొడుకును గెలిపించుకోవాలనే లక్ష్యంతో మందా జగన్నాథం ఉన్నారు.

 

ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ దక్కుతుందో లేదో అని ఆందోళన…  మంచి భవిష్యత్తు ఉంటుందని ఉన్న పార్టీ వదిలేసి టిఆర్ ఎస్ లోకి వస్తే నిరాశే ఎదురువుతుందేమోనని ఆశావాహుల్లో ఆందోళన. ఈ నియోజకవర్గాల్లోనే కాదు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి… ఈ అంతర్గత పోరులో ఏమీ చేయలేక సీఎం కేసీఆర్ మౌనం వఁహిస్తున్నారని కొంత మంది టీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. మరీ ఈ టిక్కెట్ల మంట ఏ విధంగా చల్లారుతుందో వేచి చూడాలి.