తెలుగుదేశంపార్టీని బలహీన పరిచెందువరు ? ఇపుడిదే ప్రశ్నపై పార్టీ నేతల్లో, క్యాడర్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. తెలుగుదేశంపార్టీ ఓ వ్యక్తి కాదని బలమైన వ్యవస్ధ అనే విషయాన్ని ప్రభుత్వానికి చాటుదామంటూ చంద్రబాబునాయుడు చెప్పటమే విచిత్రంగా ఉంది.
మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీ బాగా బలహీనపడిన మాట వాస్తవమే. గడచిన మూడు దశాబ్దాల్లో ఎప్పుడు లేనంతగా బలహీనపడిపోయిందంటే అందుకు కారణం కూడా చంద్రబాబే. పదేళ్ళు కష్టకాలంలో ఉన్నపుడు పార్టీకి అండగా నిలబడిన నేతలను, కార్యకర్తలను కాదని అధికారంలోకి రాగానే పవర్ బ్రోకర్లకు, ఫిరాయింపు నేతలకు పెద్ద పీట వేశారు. చంద్రబాబుకు చినబాబు తోడయ్యారు. పార్టీ నేతలను అవమానించారు.
చంద్రబాబు చేష్టలతో చాలామందికి ఒళ్ళు మండిపోయింది. పోనీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా పోస్టులు ఇచ్చారా ? అంటే అది కూడా చాలా తక్కువే. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడ) ఛైర్మన్ లాంటి అనేక పదవులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంచేశారు. పార్టీ నేతల నెత్తిపై ఫిరాయింపు మంత్రులు, ఎంఎల్ఏలను ఉంచటంతో ఇద్దరి మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి.
నేతలకు, కార్యకర్తలను ఐదేళ్ళు పురుగులను చూసినట్లు చూశారు. చాలామందిని దగ్గరకు రానీయలేదు. దాంతో అన్నీ జిల్లాల్లోను నేతలు, క్యాడర్ వ్యతిరేకమైపోయారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుపై తమ కసి తీర్చుకున్నారు. దాని ఫలితమే పార్టీకి ఘోర ఓటమి. ఇపుడు అర్ధమవుతున్నదేమిటి ? పార్టీని బలహీనపరిచింది, దెబ్బ కొట్టిందే చంద్రబాబు, చినబాబని. అలాంటి చంద్రబాబు ఇపుడు పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.