జస్ట్ ఆస్కింగ్: పోలవరం కడుతున్నరా.? ముంచేస్తున్నారా.

polavaram,
polavaram,
polavaram,

పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి టీడీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారం కాస్తా, ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని నిండా ముంచేసేలా వుంది. చంద్రబాబు హయాంలో జరిగిన పనుల్లో నాణ్యత లేదన్నది వైసీపీ అనుకూల మీడియా కథనాల సారాంశం. అదంతా ఉత్తదే, వైసీపీ హయాంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత కొరవడిందని టీడీపీ అనుకూల మీడియా అంటోంది. ఇందులో ఏది నిజం.? ఎవరి వాదన వాస్తవం.? అంటే, ‘ఇద్దరి వాదనల్లోనూ వాస్తవం వుంది’ అని కేంద్రం గుర్తించిననాడు, పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.

చిన్న అవకాశం దొరికితే చాలు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చెల్లించాల్సిన నిధుల్లో ‘కోత’ విధించాలని కేంద్రం చూస్తోంది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, ‘పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు..’ అని ఆరోపించారు. కానీ, ఆ ఆరోపణలకు కట్టుబడి, జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించి, నిజాలు నిగ్గు తేల్చలేకపోయారు.. ‘ఏటీఎం’ ద్వారా దోచుకున్న సొమ్ముల్ని రప్పించలేకపోయారు. ఇక, వైసీపీ పాలనలోనూ, గత చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోవడాన్ని ఏమనుకోవాలి.? వరదల సమయంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేసిందని ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తోంటే, అది చంద్రబాబు హయాంలో జరిగిన ఘనకార్యమని వైసీపీ చెప్పడం చూస్తోంటే, ఓ పద్ధతి ప్రకారం రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన మీడియా వర్గాలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది రాష్ట్రానికి ఏ రకంగానూ శ్రేయస్కరం కానే కాదు. పోలవరం అంటే, అది రాష్ట్రానికి జీవనాడి. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టు పోలవరం. వైఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుకి పాపులారిటీ పెరిగింది. ఇన్నేళ్ళుగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూనే వుందంటే.. సిగ్గుపడాల్సిన సందర్భమిది.