వినటానికి విచిత్రంగా ఉన్న ఇది నిజమే అని ఒప్పుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు 2 నెలలు కావస్తున్నా సిఎం ఫొటో పెట్టటానికి ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటి ఉన్నతాధికారులు అంగీకరించటం లేదు. ప్రభుత్వాలు మారినపుడు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎవరు అధికారంలో ఉన్నా వారి ఫొటోలు పెట్టటం చాలా సహజం.
రాష్ట్రప్రభుత్వం కార్యాలయాలన్నింటిలోను ప్రధానమంత్రి ఫొటో పెట్టినా పెట్టకపోయినా ముఖ్యమంత్రి ఫొటో మాత్రం పెడతారు. అలాగే ప్రభుత్వం మారిపోగానే మాజీ సిఎంల ఫొటోలు కూడా తీసి దాచేస్తారు. కానీ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటిలో మాత్రం రివర్సులో జరుగుతోందట వ్యవహారం.
తన చాంబర్లో జగన్ ఫొటో పెట్టమని యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సివి రావు తన సిబ్బందికి ఆదేశించారట. కానీ ప్రొఫెసర్ రావు ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు ఏమాత్రం లెక్క చేయటం లేదట. ఎందుకంటే జగన్ ఫొటో పెట్టాలంటూ ఉత్తర్వులు జారీ కాలేదు కాబట్టి ఫొటో పెట్టేందుకు లేదంటున్నారట.
విషయం ఏమిటయ్యా అంటే జగన్ ను ముఖ్యమంత్రిగా కొందరు ఉన్నతాధికారులు అంగీకరించలేకపోతున్నారట. అందుకనే జగన్ ఫొటో పెట్టటానికి వాళ్ళు అడ్డుపడుతున్నారు. నిజానికి విసి ఛాంబర్లో జగన్ ఫొటో పెట్టాలని అనుకుంటే ఇతర ఉన్నతాధికారులు అడ్డుపడటం ఏమిటో అర్ధం కావటం లేదు. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే జగన్ ఫొటో పెట్టిన విషయం తెలిసిందే. వాళ్ళెవరికీ లేని అభ్యంతరం విసి కింద స్ధాయి ఉన్నతాధికారులకు ఏమిటో ?