జగన్ ను వ్యతిరేకిస్తున్న నేతలు

పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో నేతలు, క్యాడరే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి 151 అసెంబ్లీ సీట్ల అఖండ మెజారిటితో గెలిచిన తర్వాత చాలామంది నేతలు టిడిపి నుండి బయటకు వచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇలా టిడిపిని వదిలేస్తున్న వాళ్ళలో కొందరు వైసిపిలో చేరుతున్నారు. ఇలాంటి చేరికలనే నేతలు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా జూపూడి ప్రభాకర్ వైసిపిలో చేరటంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వైసిపిలో ఉండి తర్వాత టిడిపిలో చేరారు జూపూడి. అధికారం మీద యావతోనే టిడిపిలో చేరిన ఈయన జగన్మోహన్ రెడ్డిపై ఏ స్ధాయిలో రెచ్చిపోయారో అందరూ చూసిందే.

ఇటువంటి జూపూడిని కూడా జగన్ సాధరంగా ఆహ్వానించటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపిగా టిడిపి తరపున పోటి చేసి ఓడిపోయిన అడారి ఆనందకుమార్ కూడా వైసిపిలో చేరారు. మళ్ళీ ఆయన తండ్రి అడారి తులసీరావ్ మాత్రం టిడిపిలోనే ఉన్నారు.

అంటే టిడిపిలో నుండి బయటకు వస్తున్న వాళ్ళు తమ అవసరాల కోసమే వైసిపిలో చేరుతున్నారన్నది వాస్తవం. టిడిపిలో ఉన్నంత కాలం జగన్ తో పాటు కుటుంబ సభ్యులపై రెచ్చిపోయిన నేతలను ఇపుడు పార్టీలో చేర్చుకోవటాన్ని అంగీకరించలేకపోతున్నారు. అందుకనే జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మరి వాళ్ళ మనోభావాలు జగన్ దాకా వెళతాయా ?