చంద్రబాబుపై బిజెపి సుబ్రమణ్యాస్త్రం

బిజెపి నుంచి టిడిపి దోస్తీ కట్ అయ్యాక ఆ రెండు పార్టీల మధ్య వైరం పెరిగిపోతుంది. ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నేంత యుద్దం కొనసాగుతుంది. ఒకరి లోపాలను ఒకరు వెతికి మరీ బయటపెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే బిజెపి ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ అస్త్రాన్ని సంధించబోతుంది.

బిజెపి చంద్రబాబుపై సంధించే అస్త్రం… బిజెపి నాయకుడు, ఆర్థికవేత్త, రాజ్యసభ సభ్యుడైన సుబ్రమణ్య స్వామి అస్త్రం… ఈయన గతంలో హేమాహేమీలైన నాయకులపై పలు అస్త్రాలు సంధించి వారిని ముప్పుతిప్పలు పెట్టారు. అయితే ఇప్పుడు ఏపీలో బిజెపి పుంజుకోవాలంటే సుబ్రమణ్య స్వామి అస్త్రాన్ని చంద్రబాబుపై వదలాలని బిజెపి సిద్దమైంది.

సుబ్రమణ్య స్వామి గతంలో దివంగత నాయకురాలు, తమిళనాడు మాజీ సీఎం జయలలితపై పలు  ఆరోపణల్లో కేసులు పెట్టి జైలుకు పంపించారు. అదే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణాలు జరిగాయని కేసులు పెట్టాడు. ఆ కేసులో పలువురు నేతలు ఇప్పటికీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక పై కేసు వేసి సోనియా గాంధీకి చుక్కలు చూపించారు. ఆయనతో ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ పలు కేసులు వేయించబోతుంది. చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని బీజేపీ కసితో ఉంది.

సీఎం చంద్రబాబుపై రెండు అస్త్రాలు వదలటానికి బీజేపీ సిద్దమైంది. అందులో మొదటిది శ్రీవారి ఆభరణాల కేసు, అర్చకుల వివాదాలు…ఈ మధ్య తిరుమలలో వివాదాలు  తారాస్థాయికి చేరాయి. తిరుమల శ్రీవారి ఆభరణాలు అన్ని మాయమయ్యాయని పెద్ద దుమారమే రేగింది. ప్రభుత్వం నగలను మాయం చేసిందని, శ్రీవారి ఆభరణాలపై విచారణ చేయించాలని సుప్రీం కోర్టులో సుబ్రమణ్య స్వామి  పిటిషన్ వేస్తానని బాహాటంగానే చెప్పాడు. దీని వెనుక బిజెపి ఉందనే అనుమానాలు ఉన్నాయి. అలాగే అర్చకుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారనే ఉద్దేశ్యంతో చంద్రబాబుపై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయాలనే భావిస్తుంది.

ఇక ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చి చంద్రబాబును చిక్కుల్లో పడేయాలని చూస్తుంది. టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి ఓటుకు డబ్బులిస్తూ దొరికిపోయాడు. అలాగే చంద్రబాబు మాట్లాడినట్టు ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి కానీ అది నిజంగా బాబు వాయిసేనా అనేది తేలాల్సి ఉంది. ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఎంతటి విచారణకైనా సిద్దమేనని తెలిపారు.

టిటిడిపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలంటూ ఎంపి సుబ్రమణ్యస్వామి వేయనున్న పిటిషన్‌ ఈనెల 19న సుప్రీం కోర్టు ముందుకు రానున్నట్లు ఆయన కార్యాలయం నుంచి సమాచారం అందుతున్నది. ఆయన వేసే పిటిషన్ అనేక ఆసక్తికరమయిన అంశాలను వెలుగులోకి తీసుకురానుంది. అభరణాల మాయం తో పాటు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న వివాదాస్సద నిర్ణయాలను, నిధుల మళ్లింపు, పురాతన కట్టడాల సంరక్షణ, వంశపారంపర్య ఆర్చకత్వం, వంటి అంశాలు ఈ పిటిషన్ వల్ల చర్చకు రానున్నాయి. ఇవన్నీ చంద్రబాబును ఇరుకున పెట్టే విషయాలే.