ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో కాకలు తీరిన, తలపండిన మరే ఇతర నాయకుడికీ లేని ప్రత్యేకత అది. తాను చేయలేనిది మరొకరు చేయడం ఆయనకు ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. తన అసాధ్యమైన విషయాన్ని మరొకరు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారంటే భరించలేని మనస్తత్వం ఆయనది. ఏ విషయాన్నయినా డబుల్ మీనింగ్‌లో మాట్లాడటం ఆయనకు అలవాటు. ప్రత్యేక హోదా మొదలుకుని దాదాపు అన్ని విషయాల్లోనూ ఆయనది డబుల్ స్టాండే. చివరికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడంలో కూడా ఆయనది రెండు నాల్కల ధోరణే. అలాంటి నాయకుడు తన గాలిని తానే తీసుకున్నారు. కేసీఆర్‌ను విమర్శించే క్రమంలో.. తన ప్రాధాన్యతను తానే తగ్గించుకున్నారు. దేశంలో మూడో ఫ్రంట్‌కు అవకాశమే లేదంటూ తన గాలిని తానే తీసుకున్నారు. దేశంలో ఎన్డీఏ లేదా యూపీఏ కూటములే ఉంటాయని, మూడో ఫ్రంట్‌కు అవకాశమే లేదనేది చంద్రబాబు ఉవాచ.
ఇక్కడా `యూ టర్నే`
కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేకుండా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాలను ఎండగడుతూ పలు సందర్భాల్లో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమని అంటోన్న అదే చంద్రబాబు.. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన విషయం గుర్తుండే ఉంటుంది. అంతకుముందు- నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకులందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అదంతా గతం. అప్పట్లో ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబు నడిచిన బాటలోనే కేసీఆర్ కూడా నడుస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అంటే భగ్గున మండిపడే పార్టీలతో జట్టు కట్టడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సరే! అవి ఎంత వరకు కార్యరూపం దాల్చుతాయనేది సందేహమే. నిజానికి- కమ్యూనిస్టులతో పాటు టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలకు కాంగ్రెస్, బీజేపీలంటే ఏ మాత్రం పడవు.
ప్రత్యామ్నాయం అంత కష్టమా?
కాంగ్రెస్, బీజేపీలకు సమదూరాన్ని పాటించే పార్టీలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకుని రాగలిగితే.. ఖచ్చితంగా అవి ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా మారగలవు. ఈ విషయం గతంలోనే రుజువైంది కూడా. కాంగ్రెస్, బీజేపీల మద్దతు లేకుండా వీపీ సింగ్, దేవేగౌడ, ఐకె గుజ్రాల్ ప్రధానమంత్రులు అయ్యారు. అలాంటి రాజకీయ వాతావరణాన్ని మరోసారి తీసుకుని రావడానికి కేసీఆర్ కొద్దో, గొప్పో కృషి చేస్తున్నారు. ఆయన చేస్తోన్న ప్రయత్నాలకు చంద్రబాబు మోకాలడ్డుతున్నారు. కేసీఆర్ చేస్తోన్న ఫెడరల్ ఫ్రంట్ యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారు. దేశంలో బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలు లేకుండా మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం అసాధ్యమని అంటున్నారు. అదెలా సాధ్యం కాదో శాస్త్రీయబద్ధంగా విశ్లేషించడం కూడా చంద్రబాబుకు తెలియట్లేదు. `ఉంటే బీజేపీ లేదా కాంగ్రెస్` అన్నట్టుగా వ్యవహరిస్తున్నారాయన. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఉంటూ కూడా గత్యంతరం లేక హస్తం పార్టీతో పొత్తులు పెట్టుకునే స్థాయికి దిగజారారు.
తిప్పడానికి చక్రాలేమీ లేనట్టే..!
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం భావ దారిద్ర్యానికి నిదర్శనం. తనకు ఎక్కడా నిలువ నీడ లేదనే ఉద్దేశంతోనో, లేక తనను ఎవరూ నమ్మరని భావించారో గానీ.. ఏకంగా చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరిపోయారు. గ్రహణం పట్టిన చంద్రునిలా తయారయ్యారు. తాను ఢిల్లీలో ఎన్నోసార్లు చక్రం తిప్పానని స్వయంగా చంద్రబాబే చెప్పుకొచ్చారు. ఇప్పుడా పరిస్థితి లేదని గ్రహించినట్టు ఉన్నారు. మోడీతో జట్టు కట్టి ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు చంద్రబాబు. ఇలాంటి మాటలతో 2014లో అధికారంలోకి రాగలిగారు. సరిగ్గా నాలుగేళ్లలోపే రాహుల్ గాంధీ పంచన చేరి అదే డైలాగును మోడీపైకి విసిరారు. పైగా తాను చేసిందే సరైందని జనాన్ని నమ్మించే పనిలో పడ్డారు. దీనికోసం అందుబాటులో `అన్ని రకాల వనరు`లనూ ఆయన జనం మీదికి ప్రయోగిస్తున్నారు. రోజుకో కొత్త ప్రకటనతో జనాన్ని అయోమయంలో పడేస్తున్నారు. తన మాటే నెగ్గాలని, తాను చెప్పిందే వినాలని జనాన్ని శాసిస్తున్నారు.