అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య (హత్య ?)కు రకరకాల కారణాలు బయటకు వస్తున్నాయి. మీరే కారణమంటే కాదు మీరే కారణమంటూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ మొదలైపోయింది. కారణాలు ఏవైనా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయాలు కొనున్నాయి.
మొదటిది అసెంబ్లీలో వైసిపికి జరిగిన ప్రతీ అవమానం వెనుక చంద్రబాబునాయుడున్నారు. స్పీకర్ కాబట్టి కోడెలను ముందుంచి వెనకనుండి చంద్రబాబు డ్రామాలాడించారు. దాని ఫలితంగానే వైసిపికి కోడెల టార్గెట్ అయ్యారు. అదే సమయంలో కోడెల అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో చేయని అరాచకం లేదు. దాని ఫలితంగానే మామూలు జనాలతో పాటు పార్టీలో కూడా కోడెల అంటే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది.
ఎప్పుడైతే అధికారంలో నుండి దిగిపోయారో అప్పట్లో తాము చేసిన అరాచకాలే కేసుల రూపంలో కోడెల కుటుంబాన్ని చుట్టుముట్టాయి. అదే సమయంలో అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసులో కొడుకుతో పాటు స్వయంగా తానే సాక్ష్యాధారాలతో సహా ఇరుక్కుపోయారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే పార్టీ ఓడిపోయిన తర్వాత కోడెల పార్టీలోనే ఒంటరైపోయారు. కోడెలను టార్గెట్ చేస్తు వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు మద్దతుగా ఒక్క టిడిపి నేత కూడా నిలబడలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకే నేతలు కోడెలను దూరం పెట్టేశారని సమాచారం.
అన్నింటికన్నా ముఖ్యమైనది కోడెలను కొడుకే శారీరకంగా హింసించారనే ప్రచారం. కోడెల బావమరిది కంచేటి సాయి ఫిర్యాదు ప్రకారం కొడుకే కోడెలను హత్య చేశారు. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా కోడెల మృతిలో టిడిపి హస్తమే ఎక్కువగా కనబడుతోంది.