కోడెల మృతిపై బిజెపి రాజకీయం

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్యపై బిజెపి కూడా రాజకీయం మొదలుపెట్టేసింది. కోడెల ఆత్మహత్య ఘటనపై రెండు ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాని అంటూనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళతానని చెప్పటమే విచిత్రంగా ఉంది.  కోడెల ఆత్మహత్య ఘటన కేంద్ర హోం శాఖ మంత్రి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది వాస్తవం.

ఏపిలో అధికార వైసిపి-ప్రతిపక్ష టిడిపి మధ్య మొదలైన తాజా వివాదాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలన్న నిర్ణయం స్పష్టంగా అర్ధమైపోతోంది. కోడెల మృతిపై దర్యాప్తు చేయాల్సింది తెలంగాణా ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే కోడెల ఆత్మహత్య చేసుకున్నది హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఇంట్లోనే. అందుకే బంజారా హిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నది.

ఇక వైసిపి-టిడిపి మధ్య మొదలైన రాజకీయ రచ్చ అంతా కేవలం చంద్రబాబునాయుడు అండ్ కో చేస్తున్న బురద రాజకీయం మాత్రమే.  గడచిన మూడు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టిడిపితో పాటు బిజెపి నేతలు కూడా టార్గెట్ గా చేసుకున్న విషయం అందరూ చూస్తున్నదే.  కాకపోతే రెండు పార్టీలను జగన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు.

పోలవరం రీ టెండర్లు, పిపిఏల సమీక్ష ఇలా ఏ విషయంపైన కేంద్రం అభ్యంతరాలు చెబుతున్నా జగన్ ముందుకే వెళుతున్నారు. దాంతో కేంద్రం, బిజెపి జగన్ పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే కోడెల ఆత్మహత్య ఘటనను బిజెపి అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు అర్ధమైపోతోంది. మరి బిజెపి ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాల్సిందే.