తెలుగుదేశంపార్టీ వాదన చాలా విచిత్రంగా ఉంటుంది. వినేవాళ్ళు నవ్వుకుంటారనే సిగ్గు కూడా లేకుండా నోటికేదొస్తే అది మాట్లాడేస్తుంటారు. తాజాగా కోడెల గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయంలో కూడా టిడిపి నేతలు అలాగే మాట్లాడుతున్నారు.
విషయం ఏమిటంటే శుక్రవారం రాత్రి గుండెనొప్పి వచ్చిందని కోడెల గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసులో కోడెలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజో రేపో అరెస్టు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు.
సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆసుపత్రిలో చేరిన కోడెలను పరామర్శించేందుకు టిడిపి సీనియర్ నేతలు దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు తదితరులు వచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపోయారు. ఎందుకయ్యా అంటే ప్రభత్వం పెట్టిన ఒత్తిడి వల్లే కోడెలకు గుండెనొప్పి వచ్చిందంటూ విచిత్రంగా ఆరోపణలు మొదలుపెట్టారు.
అంటే వీళ్ళ వాదన ఎలాగుందంటే దొంగతనం చేసినా కోడెలను ప్రభుత్వం పట్టించుకోకూడదన్నట్లుగా ఉంది. ఎందుకిలా మాట్లాడుతున్నారంటే కోడెల టిడిపి సీనియర్ నేత కాబట్టే. వరదల ప్రాంతంలో ఎవరో ఇద్దరు యువకులు కరకట్ట మీద చంద్రబాబునాయుడు ఇంటిపై ద్రోన్ ఎగరేశారు కాబట్టి బాధ్యులతో పాటు జగన్ ను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన ప్రబుద్ధులు వీళ్ళు.