సంక్రాంతి పండగ అంటే చాలు మన తెలుగువాళ్ళందరికీ గుర్తుకువచ్చేది ముందు కోడి పందాలు. కోడిపందాలు లేనిదే సంక్రాంతి ఉండదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవి ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. పండగకు నెల రోజుల ముందు నుంచే పందెం కోళ్ల హడావిడి ప్రారంభవుతుంది.
ఇక ఇదిలా ఉంటే… ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పండగ సందడితో పాటు కోడి పందేల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కోడి పందేల నియంత్రణ పై 2016లో ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కోడి పందేలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు తెలిపారు.
ఐతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడిపందేల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు సంక్రాంతి పండక్కి కోళ్ల పందేలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోళ్ల పందేలు ఏపీలో సంస్కృతి, సంప్రదాయంలో భాగమని.. వాటి నుంచి తమను ఎవరూ దూరం చేయలేరని నిర్వాహకులు చెబుతున్నారు.