రాయిటర్స్ వార్త సంస్థ మరో బాంబు పేల్చించింది. కియా కర్మాగారం మరో రాష్ట్రానికి తరలించే ఆలోచనలో యాజమాన్యం వుందని గతంలో తను వెలువరించిన కథనానికి కట్టుబడి వున్నట్లు తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరో మారు సంచలనం సృష్టించింది. అనంతపురం జిల్లాలో నెలకొల్ప బడిన దక్షిణ కొరియాకు చెందిన “కియా” కర్మాగారం వ్యవహారం అటు ఇటు తిరిగి రాజకీయ రంగు పులుము కొంది. అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులు తలెత్తు తున్నందున తమిళ నాడుకు ప్లాంటు తరలించే ఆలోచనలో వుందని ఈ పాటికే సంప్రతింపులు జరిపిందని అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ ఒక కథనం ప్రకటించింది.
ఈ ప్రకటన రాష్ట్రంలోనో కాకుండా ఢిల్లీ వరకు తుదకు పార్లమెంటులో రచ్చకు దారి తీసింది. దీనిపై రాజకీయంగా వాద వివాదాలు సాగాయి. తుదకు రాయిటర్స్ వార్త సంస్థను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారనే వరకు వైసిపి నేతలు ప్రకటనలు చేశారు. వాస్తవం చెప్పాలంటే ఈ ఆరోపణ ద్వారా చంద్రబాబు నాయుడుకు లేని పలుకుబడిని వైసిపి నేతలు ఆపాదించారు. ఇది వరలో వైసిపి ప్రభుత్వం పై జాతీయ మీడియాలో వ్యతిరేకంగా వార్త కథనాలు సంపాదకీయాలు వచ్చినపుడు కూడా వైసిపి నేతలు చంద్రబాబు నాయుడుకు లేని ఖ్యాతిని అంట గట్టారు.
రాయిటర్స్ వార్త కథనం సంచలనం కలిగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఖండించింది. అలాంటిదేమీ లేదని ప్రకటన చేసింది. అంతే కాకుండా కియా మోటార్ ఇండియా ప్రజాసంబంధాల విభాగానికి చెందిన ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో కర్మాగారం తరలించే ప్రతిపాదన లేదని పేర్కొన్నారు. దీనితో సర్దుమణుగు అవుతుందని భావించారు.
అంత వరకైతే ఫర్వాలేదు. తను ప్రకటించిన కథనం రాయిటర్స్ సంస్థ డెలిట్ చేసి నట్లు కూడా కొన్ని వార్తలు ప్రచారంలోనికొచ్చాయి. తర్వాత ఏమైందో తెలియదు గాని రాయిటర్స్ వార్త సంస్థ తను వెల్లడించిన కథనానికి కట్టుబడి వున్నట్లు కియా ఇతర రాష్ట్రాలకు ప్లాంటు తరలించే ప్రయత్నాల్లో వున్నట్లు వెల్లడించింది. దురదృష్టం ఏమంటే ఆంధ్ర ప్రదేశ్ లో వెల్లువెత్తు తున్న రాజకీయ తుఫానులో ఒక బహుళ జాతి గుత్త పారిశ్రామిక సంస్థతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ కూడా రాజకీయ రంగు పులుము కొంటున్నాయి