ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఊమెన్ చాందీ, సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, పళ్లంరాజు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. అధిష్టానం నిర్ణయం సరైనది కాదని ఫిబ్రవరి 19, 2014న ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. మార్చిలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 లో జరిగిన ఎన్నికలలో అభ్యర్ధులను పోటికి నిలిపినా ఆయన మాత్రం పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఏపీలో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు పోయాలని అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పార్టీలో నుంచి వెళ్లిపోయిన నేతలందరిని తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది. ఈ మధ్య కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఆయన రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1960 సెప్టెంబర్ 13 న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డి దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం చిత్తూరు జిల్లా. కిరణ్ కుమార్ బాల్యం, విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే సాగింది. నిజాం కళాశాల, ఉస్మానియాలో బికాం, ఎల్ ఎల్ బి చదివారు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన క్రికెట్ లో కెప్టెన్ గా ఉన్నప్పుడు టీంలో అజారుద్దీన్, హర్షాభోగ్లేలు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాథ్ రెడ్డి 1987లో మృతి చెందడంతో, 1988లో జరిగిన వాయల్పాడు ఉపఎన్నికల్లో ఆయన తల్లి సరోజనమ్మ పోటి చేసి ఓడిపోయారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పోటి చేసి గెలుపొందారు. 1994లో ఓడిపోయినా 1999,2004,2009లో వరుసగా గెలుపొంది హ్యట్రిక్ సాధించారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్ గా, 2009లో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.
వైఎస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా చేసినా ఆయన రాజీనామా చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఎన్నికయ్యారు. 2010 నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంతో 2014 ఫిబ్రవరి 19న సీఎం పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పరాభావం ఎదుర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఆంధ్రపదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటుదేమో చూడాలి. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా తాను పనిచేయడానికి సిద్దమేనని ఆయన ప్రకటించారు. కిరణ్ రాకతో ఏపీ కాంగ్రెస్ లో జోష్ మొదలైంది.