ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో బీజేపీ స్టాండ్ ఏంటి అన్నదానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ మిత్ర పక్షం పవన్ కళ్యాణా, లేక జనసేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత కొంత కాలంగా ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. జనసేన-బీజేపీ మధ్య మైత్రి కన్నా.. వైసీపీ-బీజేపీల మధ్యే బంధం బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ జనసేన కన్నా వైకాపా నేతలు, ముఖ్యంగా జగన్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
బీజేపీ అంతర్గత వ్యవహారాలపై వైకాపా ఎంపీ ఘాటుగా వ్యాఖ్యలు చేసినా.. రాష్ట్రంలో ఒకరిద్దరు మినహా అధిష్టానం నుండి పెద్దగా కదలిక కనిపించలేదు. ఇక అమిత్ షా వంటి నేతలు నేరుగా జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.
కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు బాగున్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినట్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ర్యాపిడ్ కిట్ల వ్యవహారానికి సంబంధించి కన్నా వైకాపాపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా, కన్నాపై వైకాపా నేతలు ఘాటు విమర్శలు ఆరోపణలు చేసినా అధిష్టానం నుండి స్పందించిన వారు ఎవరూ కనిపించలేదు.
విద్యుత్ కొనుగోళ్లు వంటి ఒకటి రెండు అంశాలపై తప్ప మిగిలిన చాలా అంశాల్లో వైకాపాకు మద్దతుగానే ఉన్నట్లు సంకేతాలిచ్చింది. తాజాగా పరిస్థితులు చూస్తుంటే.. కేవలం మిత్ర పక్షం అని చెప్పడానికే తప్ప పవన్‌కు బీజేపీ ఇచ్చిన విలువ ఏమీ లేనట్లుంది. మరి ఇవన్నీ పవన్ గమిస్తున్నారో.. లేదో.. లేక గమనించో సైలెంట్‌గా ఉంటున్నారో..!