కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదో పరీక్షలు వాయిదా వేసి, ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివరించారు.
ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం అనేది విద్యార్థులకు శ్రేయష్కరం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 31వ తేదీ తర్వాత విద్యా శాఖ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు.
కేవలం పరీక్షల రద్దు మాత్రమే కాదు.. జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇంటి వద్దకే ఆహారం కూడా పంపిణీ చేయాలని ఆదేశించడం, అందుకు చర్యలు చేపడుతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఆహారాన్ని వాలెంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా, లేదా మరోదైనా ప్రత్యామ్నాయంపై చర్చలు చేస్తున్నారు. ఏది ఏమైనా పరీక్షలు రద్దు చేయడంతో స్కూలు పిల్లలు మాత్రం సంబరపడిపోతున్నారు.