ఎస్‌ఈసీ నిర్ణయాలు ఉద్యోగులు చెప్పాల్సిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైకాపా ప్రభుత్వ నిర్ణయాలపై ఘాటుగా సమాధానమిచ్చారు. ఎన్నికల కమిషనర్ తీసుకొనే నిర్ణయాలన్నీ ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తూ.. ఈ మేరకు హైకోర్టులో ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌‌కు రమేష్ కుమార్ రిప్లై పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ప్రభుత్వ అఫిడవిట్ పై అంశాల వారీగా వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల ప్రక్రియ ఫిబ్రవరిలోనే మొదలుపెట్టామని చెప్పడం అవాస్తవమని పేర్కొన్నారు. ఎస్‌ఈసీ తీసుకొనే నిర్ణయాలన్నీ ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల వాయిదా గోప్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని రమేష్ కుమార్ తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తానే కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు అధిక సంఖ్యలో ఏకగ్రీవమయ్యాయని కూడా రమేష్ పేర్కొన్నారు.

మరి తాజాగా రమేష్ కుమార్ ప్రభుత్వంపై న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్‌లోని అంశాలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా.. లేదా చాలా కాలంగా ప్రభుత్వానికి అనేక విషయాల్లో చుక్కెదురైనట్లే.. ఈ విషయంలోనూ జరుగుతుందా అనేది చూడాలి.

ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేష్‌లలో కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు చెబుతుందో చూడాల్సి ఉంది. ఎవరికి తీర్పు అనుకూలంగా వస్తుందో అని ఏపీ ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.