ఇంతకన్నా చంద్రబాబు నుండి ఏమీ ఆశించలేం

వరదబురద రాజకీయాలు తప్ప చంద్రబాబునాయుడు నుండి ఏమీ ఆశించలేమని మరోమారు అర్ధమైపోయింది. కరకట్ట మీదున్న తన నివాసాన్ని ముంచాలన్న కుట్రతో అందరి ఇళ్ళను ప్రభుత్వం ముంచేసిందట. కేవలం తన ఇంటిని ముంచాలన్న టార్గెట్ తోనే ప్రకాశం బ్యారేజి నుండి ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీటిని ప్రభుత్వం వదిలేసిందని చంద్రబాబు ఆరోపించారు. వరద తగ్గిపోయిన తర్వాత కృష్ణాజిల్లాలోని పామర్రు, పెడన లాంటి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

బాధితులతో మాట్లాడుతూ కరకట్ట మీద తన ఇంటిని ఎలా ముంచాలన్న ఏకైక ధ్యేయంతో మంత్రులు పనిచేసినట్లు మండిపోయారు. ప్రకాశం బ్యారేజి భద్రతను కూడా ప్రభుత్వం గాలికొదిలేసినట్లు ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది. ప్రాజెక్టుల్లోకి నీళ్ళు ఎంత వస్తోంది ? ఎంత బయటకు వదలాలి అనే విషయంలో అధికారుల దగ్గర లెక్కలుంటాయంటూ కొత్త విషయాన్ని చెప్పారు.

నిజానికి చంద్రబాబు ఆరోపణల్లోనే డొల్లతనం బయటపడుతోంది. పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజికి రోజుకు ఎంత ఇన్ల్ఫో వస్తోంది ఎంత అవుట్ ఫ్లో వెళుతోందనే విషయంలో ఇరిగేషన్ శాఖ లెక్కలు ప్రకటించింది. అంటే వస్తున్న నీటిని, బయటకు పంపుతున్న నీటిని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ లెక్కలు తీస్తోందన్న విషయం స్పష్టం అవుతోంది.

కాకపోతే సమస్య ఎక్కడ వస్తోందంటే ఇరిగేషన్ శాఖ ప్రకటించిన లెక్కలు చంద్రబాబు అండ్ కో తప్పులంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంపై  వాళ్ళకు నమ్మకం లేదట. చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఇదే అధికారులు లెక్కలు ఇచ్చేవారు. జగన్ సిఎం అయిన తర్వాత కూడా ఇదే అధికారులు లెక్కలు ఇచ్చారు. అయినా ప్రభుత్వంపై నమ్మకం లేదని చెబుతున్నారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. చివరకు తన ఇంటిపై ద్రోన్లు ఎగరేసే అధికారం ఎవరిచ్చారని ఏకంగా ప్రభుత్వాన్నే ప్రశ్నస్తున్నారంటే చంద్రబాబు నుండి ఇంతకుమించి ఆశించటం దండగే.