తెలంగాణ రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది టీఆర్ఎస్ అధినాయకత్వం. 2014 సాధారణ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 63 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి గుంజుకుంది. అలా బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, టీడీపి నుంచి 12మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, సీపీఐ నుంచి ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు. అదే విధంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పోటీ చేసి విజయం సాధించింది. మజ్లిస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు స్నేహంగానే వ్యవహరిస్తున్నారు.
నర్సంపేట అసెంబ్లీ నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్ధి దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో సభలో టీఆర్ఎస్ బలం 90కి చేరింది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులున్నారు. ఆపరేషన్ గులాబీ ఆకర్ష్, బంగారు తెలంగాణ నిర్మాణం వీటి వలలో ఈ మిగిలిన ఎమ్మెల్యేలు చిక్కలేదు. అయితే మిగిలిన 20 స్థానాల్లో విపక్ష నేతలు ఉన్న ఆ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నల్లగొండ జిల్లాపై టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత జానారెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుంచి, ఉత్తమ్ భార్య పద్మావతి హూజుర్ నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నల్లగొండ నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే నాగార్జునసాగర్, కోదాడ, హూజర్ నగర్ లపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన ఆయా నియోజక వర్గాల్లో వరుస పర్యటనలు చేస్తూ ప్రణాళికలు వేస్తున్నారు.
మహబూబ్ నగర్ లో ఇప్పటికే కేటీఆర్ పర్యటనలు మొదలు పెట్టారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఓడించడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటనలు చేస్తున్నారు. ఇక గద్వాలలో డీకే అరుణ స్థానం పై ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మధ్య మీటింగ్ పెట్టి గద్వాల ప్రాంతానికి వరాలు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్.. హారీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. హారీష్ రావు ఇప్పటికే కొడంగల్ లో రేవంత్ ను ఓడించేదుకు తీవ్ర కసరత్తే ప్రారంభించారు. ఇక జగిత్యాల ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి స్థానాన్ని గెలిపించుకునేందుకు సీఎం కూతురు కవిత రంగంలోకి దిగారు. ఈ స్థానం నుంచి ఆమె స్వయంగా పోటీ చేయనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యేగా ఉన్న సున్నం రాజయ్య స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళిక వేస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిరను దక్కించుకునేందుకు తుమ్మల, హరీష్ రావులు పావులు కదుపుతున్నారు. అక్కడ నిత్యం పర్యటిస్తూ టీఆర్ఎస్ ను గెలిపించేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. దొంతి మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సంపేట అసెంబ్లీ స్థానంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని వ్యూహాలు రచిస్తున్నారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే 5 స్థానాలు గెలుచుకున్న బీజేపీని ఉనికి లేకుండా చేయాలని టీఆర్ఎస్ తహతహలాడుతోంది. అందులో భాగంగానే గ్రేటర్ లో భారీగా చేరికలు జరుపుతున్నారు. ఇటీవల దానం నాగేందర్ ను చేర్చుకున్నారు. దానం నాగేందర్ ను ఖైరతాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. లేని పక్షంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. గోషామహల్ కోసం కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ చేర్చుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా బీజేపీ ని దెబ్బ కొట్టాలని టీఆర్ ఎస్ నాయకత్వం భావిస్తోంది.
మొత్తానికి టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలిచి ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే లక్ష్యంతో పని చేస్తుంది. కానీ టీఆర్ ఎస్ ప్రత్యర్ది పార్టీల ఉనికి లేకుండా కసరత్తు చేస్తుంటే మరోవైపు సగానికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటమి పాలవుతారని సర్వే రిపోర్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సర్వే రిపోర్టులు ఎలా ఉన్నా ఈ నాలుగేళ్ల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పరిపాలనలో చతికిలబడ్డారు. వీరిలో ఎంత మంది గెలుస్తారో లేదో అన్న టెన్షన్ గులాబీ బాసుకు పట్టుకుంది.