రియాల్టీ షో అనే పేరు పెట్టారుగానీ, అందులో రియాల్టీ కనిపించడంలేదు మొర్రో.. అంటూ పాపం బిగ్ బాస్ అభిమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. దానికన్నా యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా సాగుతోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ని ఇంకోసారి చూసెయ్యడం బెటరన్న భావన సగటు బుల్లితెర వీక్షకుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు తమ ‘మొదటి ప్రేమ’ల గురించి చెప్పుకున్నారు. ఒక్కరంటే ఒక్కరన్నా రియల్ స్టోరీ చెప్పారా.? అన్న అనుమానం బుల్లితెర వీక్షకుల్లో కలుగుతోంది. ‘వీటిని అసలు ఎవడన్నా లవ్ స్టోరీలని అనగలడా.?’ అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.. ఆ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది సోషల్ మీడియాలో. ఏమో, కంటెస్టెంట్లు చెబుతున్నది నిజమేనేమో.. కానీ, బిగ్ బాస్ నడుస్తున్న తీరు చూస్తే, ఎవరికైనా, ‘లవ్ స్టోరీల్ని’ బిగ్ బాస్ భలే రాయించాడన్న భావన కలగకుండా వుండదు.
విదేశీ అబ్బాయి.. హైదరాబాదీ అమ్మాయి.. అనే కాన్సెప్టుతో ఓ టాస్క్ నడిచింది. నడవడం కాదు.. పాకుతూ పాకుతూ ఎలాగో పూర్తయ్యింది. ఆ వెంటనే, ఆడియన్స్ నెత్తిన ఈ ప్రేమ కథల బండ మోపాడు బిగ్ బాస్. అవి ప్రేమ కథలు కాదు, ప్రేతాత్మ కథలన్న భావన అంతటా వ్యక్తమవుతోంది. ఇంకా కొన్ని స్టోరీలు మిగిలే వున్నాయి. వాటి కథేంటో నేడు తెలుస్తుంది. ఇక చాలు బాబోయ్.. అని ప్రేక్షకులు నెత్తీ నోరూ బాదుకుంటున్నా.. వారి నెత్తిన బిగ్ బాస్ బలవంతంగా చెత్తని రుద్దేస్తుండడం గమనార్హం. గత సీజన్లలోనే కాస్త బెటర్.. అన్న భావన కలుగుతోందంటే, ఈ సీజన్ ఎంత దారుణంగా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు, కాలికి గాయంతో వున్నా.. చిత్రంగా జెస్సీ ఈ వారం కెప్టెన్ అయిపోయాడు. ఇది కూడా స్క్రిప్టేనా.? లహరిని తెలివిగా తప్పించి, జెస్సీని సీన్‌లోకి (పోటీదారుల లిస్టులోకి) యాంకర్ రవి ఎందుకు రప్పించాడబ్బా.?