బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్ అయిన గంగవ్వ నిన్న ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బిగ్ బాస్ ఇంటి నుంచి తన సొంతింటికి వెళ్లింది. వచ్చిన మొదటి వారంలోనే గంగవ్వ ఆరోగ్యం దెబ్బతింది. వాతావరణం పడటం లేదు, ఏసీ గదులు, ఇంట్లొ బంధించి ఉండటం వంటి వాటి వల్ల గంగవ్వ ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది. మధ్యలో బిగ్ బాస్ ధైర్యం చెప్పి వైద్యం చేయించాడు. ఆ కొన్ని రోజులు బాగానే ఉంది.
మళ్లీ ఈ ఐదో వారంలో గంగవ్వ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. జైలు లాంటి జీవితాన్ని భరించలేక బయటకు వస్తానని మొరపెట్టుకుంది. అయితే ఈ షోకు వచ్చే ముందు గంగవ్వకు ఉన్న కోరికను బయట పెట్టింది. ఓ ఇళ్లు కట్టుకోవాలని ఉంది.. అందుకే ఈ షోకి వచ్చాను అని చెప్పింది. ఆ కోరికను ఇప్పుడు తాను దగ్గరుండి మరీ తీరుస్తానని, కొత్తింటి బాధ్యతలు తాను తీసుకుంటానని నాగ్ చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ ఇంటి నుంచి స్టేజ్ మీదకు వచ్చినా గంగవ్వకు నాగార్జున మాటిచ్చాడు. కొత్తింటి సంగతి మర్చిపో నేను దగ్గరుండి చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చాడు. దీంతో కంటెస్టెంట్లందరూ లేచి నిలబడి నాగ్ గొప్ప మనసుకు ఫిదా అయ్యారు. అయితే ఆ కొత్త ఇంటికి పెద్ద డోర్లు, పెద్ద తాళం వేయాలని, ఇప్పుడు చుట్టి వచ్చినట్టు వదిలేయ కూడదని ఫన్నీ కామెంట్ చేశాడు. మరి నిజంగానే గంగవ్వ ఇంటి బాధ్యతలను నాగ్ నెత్తిన వేసుకుని పూర్తి చేస్తాడా? అన్నది చూడాలి.