అన్ స్టాపబుల్ సీజన్ 2 లో బావతో కలిసి సందడి చేయనున్న బాలకృష్ణ..?

టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా హోస్ట్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఈ టాక్ షో మొదటి సీజన్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలను బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ వారితో సందడి చేశారు. దీంతో ఈ షో అధిక సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకోవటమే కాకుండా హోస్ట్ గా బాలకృష్ణకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

మొదటి సీజన్ కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం నిర్వాహకులు అన్ని సిద్ధం చేశారు. తొందర్లోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ 2 లో పాల్గొని సెలబ్రిటీల గురించి రోజుకు ఒక వార్త వినిపిస్తోంది. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 2 లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను కూడా బాలకృష్ణ ఇంటర్వ్యూ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ షో కి హాజరై సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ తన బావ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సందడి చేయనున్నాడు. అయితే నారా చంద్రబాబు నాయుడుని ఈ షో కి తీసుకువచ్చే బాధ్యత బాలకృష్ణ తన భుజాలపై వేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.