సోషల్ మీడియాల్లో అభిమానుల వీరంగం ఒక్కోసారి సెలబ్రిటీలకు తీరని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ట్రోలింగ్ కల్చర్ శ్రుతిమించుతుండడంతో దానిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీని పరిస్థితి. కొందరు అయితే ఏకంగా సోషల్ మీడియా ఖాతాల్ని డీయాక్టివేట్ చేస్తున్నారు. దూరంగా వెళ్లిపోతున్నారు. ఇదే కోవలో ఇటీవల వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్ ఇన్ స్టా నుంచి వైదొలగింది. అయితే తాను అలా చేయడానికి కారణమేమిటో చెబుతూ తాజాగా ఇన్ స్టాలో యాక్టివేట్ అయ్యింది.
అందుకు సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. అసలు తాను ఇన్ స్టా నుంచి దూరమైపోవడానికి కారణమేమిటా? అంటూ అభిమానులు పదే పదే తనను అడుగుతున్నారట. దానికి కారణం మానసిక ప్రశాంతతను వెతుక్కుని దూరంగా ఉన్నానని ప్రియా చెప్పింది. ట్రోల్స్ కి భయపడలేదు. పాజిటివిటీని పెంచే ట్రోలింగ్ సరైనదే కానీ కొన్ని సరికాదు అని తెలిపిన ప్రియా.. ఈ రెండు వారాల లాక్ డౌన్ పీరియడ్ లో ఎంతో ప్రశాంతంగా ఉన్నానని ఇన్ స్టా నుంచి దూరం అవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపింది. తాను మానసిక ఒత్తిడిని జయించేందుకు మనసుకు నచ్చిన పని చేస్తానని వెల్లడించింది.
ఒరు ఆధార్ లవ్ తర్వాత ప్రియా ప్రకాష్ నటించిన శ్రీదేవి బంగ్లా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ప్రస్తుతం మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇకపోతే రీసెంటుగా మీరా చోప్రా- వాణీ కపూర్ లాంటి నటీమణులు సోషల్ మీడియా ఖాతాల్లో ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. మీరా చోప్రా ఏకంగా ఎన్టీఆర్ అభిమానులపైనే సైబర్ పోలీసుల్ని ఆశ్రయించడం సంచలనమైంది.