వరుసగా రీమేక్‌లేనా? స్ట్రెయిట్ కథలు నచ్చవా?
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్ మెంట్స్ వరుసగా మలయాళ రీమేక్ లను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమమ్ లాంటి క్లాసిక్ తర్వాత మలయాళ సెన్సేషనల్ హిట్ మూవీ `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత నాగ వంశీ ఇప్పుడు మరో మలయాళ హిట్ సినిమా రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నారని తెలిసింది.
అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ నటించిన `కప్పేలా` 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో చేరింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ఇద్దరు యువ హీరోలతో రీమేక్ చేయాలని యోచిస్తోంది. ఓ యువ దర్శకుడు ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు.
మలయాళ నిర్మాత విష్ణు వేణు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కప్పేలాను తెలుగులో అల వైకుంఠపురములో, జెర్సీ లాంటి మరెన్నో సినిమాల్ని నిర్మించిన నిర్మాతలు రీమేక్ చేయనున్నారు అని ఆనందంగా ప్రకటించారు. ప్రేమమ్ & అయ్యప్పనమ్ కోషియం తర్వాత మలయాళ పరిశ్రమకు చెందిన మూడవ చిత్రం కప్పేలా.
అయితే సితార అధినేత నాగ వంశీ వరుసగా రీమేక్ లకే ప్రాధాన్యతనిస్తారా? స్ట్రెయిట్ కథలు నచ్చవా? అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఇంతకుముందు జెర్సీ లాంటి క్లాసిక్ మూవీని స్ట్రెయిట్ కథతోనే తీశారు. కానీ అది కమర్షియల్ గా అంత పెద్ద రేంజులో వర్కవుట్ కాకపోవడం నిరాశపరిచింది. ఆ క్రమంలోనే ఇలా మైండ్ సెట్ మారిందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తో సితార బ్యానర్ మాంచి స్పీడ్ మీద ఉరకలెత్తుతోంది. ఈ బ్యానర్ లో మీడియం బడ్జెట్ చిత్రాలు తెరకెక్కతుండగా.. హారిక అండ్ హాసిని బ్యానర్ లో భారీ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషియంని భారీ బడ్జెట్ తో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది.