జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబ్బులు లేక, వ్యక్తిగత ఆదాయం లేక, వ్యాపారాలు లేక మళ్లీ సినిమాలు చేయాల్సి వస్తోందని వెల్లడించిన సంగతి తెలిసిందే. పార్టీని నడపాలన్నా, తాను బ్రతుకు బండి లాగించాలన్నా! తప్పక సినిమాలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో జనసేనలో ఉన్న కొంత మంది నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేసి బయటకు వెళ్లిపోయారు. కమిటె మెంట్, డెడికేషన్ లేని వ్యక్తి అతనితో కలిసుంటే కష్టం అవుతుందని భావించి జేడీ లాంటివారు బయటకు వెళ్లిపోయారు. అలా పవన్ మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు.
`అజ్ఞాతవాసి` తర్వాత దాదాపు రెండేళ్ల పాటు పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి పనిచేసిన పవన్ చివరికి ఈ ఏడాది ఆరంభంలోనే `వకీల్ సాబ్` అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే మరో రెండు కొత్త ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించారు. అందులో ఒక చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, మరో చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవదుల్లేవ్. ఒకే ఏడాది ఏకంగా రెండు సినిమాలు చేసి రిలీజ్ చేయనున్నారని అభిమానులు తెగ సంతోషపడ్డారు. ఈ ఆనందంలో నే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సహా, త్రివిక్రమ్ తోనూ సినిమాలు చేయనున్నారని ప్రచారం సాగింది.
అలాగే పవన్ ప్రొడక్షన్ హౌస్ లో తరుచూ సినిమాల నిర్మాణ జరగనుందని తెరపైకి వచ్చింది. కానీ మాయదారి కరోనా కారణంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. `వకీల్ సాబ్` షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ చేయలేరు. పవన్ కూడా కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ సెట్స్ కు వెళ్లేది లేదని..అలా చేస్తే బాధ్యతారాహిత్యంగా వ్యవరించినట్లు ఉంటుందని అన్నారు. ఇలా జరగడం వల్ల పవన్ కి చాలా సమయమైతే వృద్ధా అవుతుంది. అటు రాజకీయంగాను ముందుకెళ్లలేక..ఇటు సినిమాలు చేసుకోలేక..మధ్యలో ఉండిపోయారు.
ఈ నేపథ్యంలో ఈ సమయాన్ని వెబ్ సిరీస్ ల కోసం వినియోగించుకోనే అవకాశం ఒకటుంది. మరి పవన్ కి వాటిపై అంత ఆసక్తిగా ఉన్నారా? అన్నదే సందేహం. ఎందుకంటే భవిష్యత్ అంతా డిజిటల్ మయం. ఇప్పటికే చాలా మంది స్టార్లు ఆ ప్లాట్ ఫామ్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వరుసలో బాలీవుడ్ స్టార్లు ముందు వరుసలో ఉన్నారు. టాలీవుడ్ నుంచి కొంత మంది హీరోలు ఆసక్తిగానే ఉన్నారు. మరి పవన్ మనసులో అలాంటి ఆలోచన ఏదైనా ఉందా? అన్నది తెలియాలి. ప్రస్తుతం ఆయన జగన్ సర్కార్ ఏడాది పాలనపై విమర్శలు గుప్పించే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.