ఫ్లాప్ డైరెక్టర్లకు మెగా బొనాంజ ఆఫర్ల వెనక కథేమి?
మెగాస్టార్ కి బంధుప్రీతి ఎక్కువా? లేక ప్రతిభావంతులకు, తనతో సింక్ అయ్యే అత్యంత సన్నిహితులకు అవకాశాలు ఇచ్చి కెరీర్ ని నిలబెట్టేందుకు ఎంత రిస్క్ అయినా చేస్తారా? ఇదీ మెగా ఫ్యాన్స్ సందిగ్ధత. ఈ ప్రశ్నలకు సమాధానం అన్నయ్య దగ్గర సిద్ధంగా ఉంది.
తాజాగా మెగాస్టార్ యాక్టివిటీస్ చూస్తుంటే ఆయనకు బంధు ప్రీతి ఎక్కువేనని.. సన్నిహితులను అసలు వదులుకునే ఆలోచన చేయరని కూడా ప్రూవ్ అవుతోంది. అందుకు ఓ రెండు ఎగ్జాంపుల్స్ ని గుర్తు చేస్తున్నారు. నిన్న మొన్నటివరకూ `సాహో` ఫేం సుజీత్ దర్శకుడిగా లూసీఫర్ ని రీమేక్ చేస్తారన్న కథనాలొచ్చాయి. కానీ ఇంతలోనే సడెన్ గా దర్శకుడు మారారు. ఈ రీమేక్ కి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. సొంత తమ్ముడి కంటే ఎక్కువగా వినాయక్ ని అభిమానిస్తారు చిరు. ఖైదీనంబర్ 150 చిత్రంతో తనని రీలాంచ్ చేసినదే తమ్ముడు వినాయక్ కాబట్టి ఆ అభిమానం వర్కవుటైందనే భావించవచ్చు. అందుకే వరుస ఫ్లాపుల్లో ఉన్నా.. ఇప్పుడు వినాయక్ కి లూసీఫర్ రీమేక్ ఆఫర్ దక్కిందన్న వాదనా వినిపిస్తోంది. అయితే సుజీత్ అవకాశానికి గండి కొట్టేయడమే మింగుడుపడనిది.
ఇదిలా ఉండగానే వరుస డిజాస్టర్లతో అసలు కెరీర్ పరంగా రేసులోనే లేకుండా వెనకబడిన మెహర్ రమేష్ కి చిరంజీవి ఓ ఆఫర్ ఇచ్చారట. అన్నయ్య స్వయంగానే ఓ వేదికపై మెహర్ తో సినిమా చేస్తానని ప్రకటించగానే అందరిలో అదే సందేహం. 2013 లో విడుదలైన షాడో తర్వాత మెహర్ రమేష్ ఏ సినిమాకి దర్శకత్వం వహించలేదు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ కి శక్తి లాంటి భారీ డిజాస్టర్ ని ఇచ్చాడు. ఆ దెబ్బ అశ్వనిదత్ కి ఎలా తగిలిందో అందరికీ తెలిసినదే. అందుకే షాడో తర్వాత అసలు ఆఫర్ అన్నదే లేదు. కానీ చిరంజీవి ప్రకటనతో అందరిలో ఒకటే ఆశ్చర్యం.
ఇప్పుడు తమిళ చిత్రం వేదాళం రీమేక్ కి చిరు పిలిచి మరీ మెహర్ రమేష్ కి ఆఫర్ ఇస్తున్నారట. ఈ రెండు ఎగ్జాంపుల్స్ తో అన్నయ్య తన తమ్ముళ్లను అసలు వదులుకోరని బంధుప్రీతి కూడా అధికమేనని ప్రూవ్ అయినట్టే. వేదాళం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్. తళా అజిత్ ఈ చిత్రంలో నటించగా దరువు లాంటి డిజాస్టర్ తీసిన శివకు అజిత్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కనీసం మెగాస్టార్ బంధు ప్రీతి తెచ్చిన ఆఫర్ అయినా పూర్తిగా క్రైసిస్ లో ఉన్న ఆ ఇద్దరు దర్శకుల్ని నిలబెడుతుందేమో చూడాలి.