శేష్‌ త‌ర్వాత మ‌హేష్ బ్యానర్‌లో ఆ హీరోకే ఛాన్స్

                            మేజ‌ర్ త‌ర్వాత జీఎంబీ బ్యాన‌ర్ మూవీ ఎవ‌రితో?

ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్నా సొంత బ్యాన‌ర్ లో సినిమాలు నిర్మించేందుకు మ‌హేష్ స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. న‌మ్ర‌త స్వ‌యంగా జీఎంబీ బ్యాన‌ర్ ప్రాజెక్టుల్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. గూఢ‌చారి ఫేం అడివి శేష్ హీరోగా మేజర్ అనే దేశభక్తి చిత్రాన్ని ఇప్ప‌టికే నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం 26/11 ముంబై దాడుల్లో తీవ్ర‌వాదుల‌పై విరుచుకుప‌డిన రియ‌ల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. పాన్ ఇండియా కేట‌గిరీ చిత్ర‌మిది. ఈ మూవీతో పాటు మ‌రో సినిమాని జిఎంబి ప్రొడక్షన్స్ లో నిర్మించేందుకు మ‌హేష్-న‌మ్ర‌త బృందం సన్నాహ‌కాల్లో ఉంది.
 
ప్ర‌స్తుతం హీరో శర్వానంద్ పేరు ప‌రిశీల‌నలో ఉంద‌ట‌. అన్నీ అనుకున్నట్టు అయితే, కొన్ని వారాల వ్యవధిలో అధికారిక ప్రకటనను ఆశించవచ్చు. ప్రస్తుతం, మహేష్ `సర్కారు వారి పాట` చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. మ‌హ‌మ్మారీ కార‌ణంగా మ‌హేష్ కాస్త ఆల‌స్యంగా సెట్స్ కి హాజ‌రుకానున్నారు.

మ‌రోవైపు శ‌ర్వానంద్ శ్రీకరమ్ స‌హా ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలోనూ న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. త‌దుప‌రి మ‌హేష్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతాడ‌ని భావిస్తున్నారు.