25 వేషాలతో చియాన్ విక్ర‌మ్.. 2020 వేస‌వి కానుక‌

చియాన్ జీవితంలో నెవ్వ‌ర్ బిఫోర్ స‌వాల్

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా 58వ సినిమా అక్టోబ‌ర్ 4నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. 7 స్క్రీన్ స్టూడియోస్, వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 వేస‌వి సెల‌వుల్లో సినిమా రిలీజ్ కానుంది. విక్ర‌మ్ స‌ర‌స‌న‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ క‌థానాయిక‌. ఈ భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రానికి ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
 
ఇంత‌కీ ఈ సినిమా ప్ర‌త్యేక‌త ఏమిటి? అంటే.. ఇందులో విక్ర‌మ్ ఏకంగా 25 వేషాల్లో అద్భుత‌మైన ఆహార్యంతో రంజింప‌జేయ‌నున్నార‌ట‌. అన్ని పాత్ర‌ల్లో ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ న‌టించ‌లేదు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ద‌శావ‌తారం చిత్రంలో 10 పాత్ర‌లు .. ప్రియాంక చోప్రా  `వాటీజ్ యువ‌ర్ రాశీ` అనే చిత్రంలో 12 వేషాల్లో మెప్పించారు. శివాజీ గ‌ణేష‌న్ న‌వ‌రాత్రి అనే క్లాసిక్ చిత్రంలో 9 వేషాల‌తో మైమ‌రిపించారు. హాలీవుడ్ న‌టుడు ఎడ్డీ మ‌ర్ఫీ ఎనిమిది పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. వీళ్లంద‌రితో పోలిస్తే విక్ర‌మ్ ఏకంగా 25 పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డం సంచ‌ల‌నం అనే చెప్పాలి. అయితే అన్ని పాత్ర‌లు తెర‌పై ఒకేసారి క‌నిపిస్తే ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా క‌థాంశాన్ని చూపించ‌గ‌ల‌రా? అంటే ద‌ర్శ‌కుడికి అదో పెద్ద స‌వాల్ అనే చెప్పాలి.