బన్నీ అన్నలా డ్యాన్స్‌ ఈ జన్మలో చేయలేను

‘పెళ్లి చూపులు’ తర్వాత నన్ను పిలిపించారు బన్నీ అన్న. చాలా బాగా చేశారు. నాకిలాంటి సినిమాలు బాగా ఇష్టం. అని అభినందించారు. ‘అర్జున్‌ రెడ్డి’ అప్పుడు మళ్లీ పిలిపించి, 20 నిమిషాలు మాట్లాడారు. ‘గీత గోవిందం’ రిలీజ్‌ ఈవెంట్‌కు బన్నీ అన్న వచ్చారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. థ్యాంక్స్‌ అన్న. బన్నీ అన్నలా డ్యాన్స్‌ ఈ జన్మలో చేయలేను ..అన్నారు విజయ్ దేవరకొండ. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఇలా తనకు బన్నిపై ఉన్న అభిమానం తెలియచేసారు.

ఇండస్ట్రీకు బయట వ్యక్తిని నేను. అవుట్‌సైడర్స్‌ నన్ను ఎక్కువ ఓన్‌ చేసుకోవడానికి కారణం అదే. మనలో ఒక్కడు సక్సెస్‌ సాధించినా మనవాడు కొట్టాడు అని సంతోషపడతారు. అందుకే చాలా మంది నాకు ఇంత ప్రేమని ఇస్తున్నారని అనుకుంటున్నాను.

‘పెళ్లి చూపులు’ చేస్తే గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ నాకు దారి చూపించాయి. వాళ్లు ఎస్‌కేయన్, బన్నీ వాసుని ఎలా తీసుకొచ్చారో అలా నేను కూడా వీలైనంత మందిని లాక్కెళ్తా. మా దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌. దాని వెనక చాలా మంది కెరీర్, ప్యూచర్‌ ఉంటుంది. ఎంటర్‌టైన్‌ అవ్వండి. కానీ వాళ్ల పనిని గౌరవించండి. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి పైరేట్‌ చేసినవాళ్లు సిగ్గుపడేలా చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

అలాగే ‘‘పైరసీని ప్రోత్సహించవద్దు. కొంతమంది పనిగట్టుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తవ్వకముందే లీకైన ‘టాక్సీవాలా’ సినిమా లింకుల్ని షేర్‌ చేశారు. కానీ నిర్మాతలు ధైర్యంగా నిలబడి మంచి నాణ్యతతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నార’’అన్నారు.

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రమిది. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాత.