విజయ్&సుధీర్‌బాబు… మీకు ఓ సూపర్‌హిట్ మిస్!

థియేటర్లలో ‘ఆర్ఎక్స్‌100’ సినిమా దుమ్ము రేపుతోంది. దర్శకుడు అజయ్ భూపతి టార్గెట్ యూత్. వాళ్లకు తగ్గట్టు ట్రైలర్ కట్ చేశాడు. సినిమా తీశాడు. రివ్యూలు, విమర్శకుల మాటలు పక్కన పెడితే… సినిమాని యూత్ తెగ చూస్తున్నారు. హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ తెలుగు ప్రేక్షకులెవరికీ పెద్దగా తెలియదు. కానీ, వసూళ్లు ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలని ఇండస్ట్రీలో జనాలు, బయట జనాలు ఆసక్తిగా ఎదురు చూసేంత హిట్ అందుకుంది. నాలుగు రోజుల్లో 5కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించిందీ సినిమా. హీరో కార్తికేయకు ఈ సినిమా పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది. అయితే… ఈ సినిమాలో హీరోగా నటించే ఆఫర్ ముందు అతడి దగ్గరకు వెళ్ళలేదు.

 

దర్శకుడు అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్‌100’  కథను ముందు చెప్పింది ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండకు. అప్పటికి ‘పెళ్లి చూపులు’ సినిమా కూడా స్టార్ట్ కాలేదు. కథ నచ్చిందని, త్వరలో ఏ విషయం చెబుతానని దర్శకుడికి చెప్పిన విజయ్ దేవరకొండ.. తర్వాత ఏ విషయం చెప్పలేదట. దర్శకుడు అజయ్ భూపతి కూడా మళ్ళీ అతణ్ణి కలవలేదు. తర్వాత కథ మ‌హేష్‌బాబు బావ సుధీర్‌బాబు దగ్గరకు వెళ్ళింది. మూడు నెలలు దర్శకుణ్ణి ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్న సుధీర్‌బాబు అవకాశం మాత్రం ఇవ్వలేదు. చివరకు కొత్త హీరో కార్తికేయతో సినిమా తెరకెక్కింది. ఇప్పుడీ విజయం చూస్తే… విజయ్ దేవరకొండ, సుధీర్‌బాబు ఓ సూపర్‌హిట్ మిస్ చేసుకున్నట్టే అనిపిస్తోంది.