యన్టీఆర్ ఫ్యామిలీని ప్రశ్నించిన విద్యా బాలన్!

హిందీ హీరోయిన్ విద్యా బాలన్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చీ రావడమే యన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిశారు. ముఖ్యంగా యన్టీఆర్ కుమార్తెలు, కోడళ్లను కలిసి మాట్లాడారు. ఆమె మాటల్లో ఎక్కువ ప్రశ్నలే వున్నాయని సమాచారమ్. అదీ యన్టీఆర్ మొదటి భార్య బసవతారం గురించి ఎక్కువ ప్రశ్నలు వేశార్ట‌. ‘బసవతారకం ఎలా వుండేవారు? ఆమె నడక, నడవడిక ఎలా వుండేవి? స్పెషల్ మేనరిజమ్స్ ఏమైనా వున్నాయా?’ అని ప్రశ్నించార్ట‌. ఎందుకు? అంటే… యన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి విద్యా బాలన్ షూటింగులో జాయిన్ కానున్నారు. షూటింగులో పాల్గొనడానికి రెండు రోజుల ముందు సోమవారమే హైదరాబాద్ వచ్చి యన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిశారామె.

 

హిందీలో వచ్చిన సిల్క్ స్మిత బయోపిక్ ‘డర్టీ పిక్చర్’లో విద్యా బాలన్ నటన విమర్శకులను, శృంగార ప్రియులను అలరించింది. తరవాత ఆమెకు ఎన్నో బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. కానీ, అవేవీ విద్యా బాలన్ అంగీకరించలేదు. యన్టీఆర్ బయోపిక్‌లో నటించడానికి ఎందుకు అంగీకరించారు? అని ఆమెను ప్రశ్నిస్తే.. “బసవతారకం యన్టీఆర్ కాదు. ఆయన భార్య మాత్రమే. తెలుగు ప్రజలు దేవుడిగా కొలిచే యన్టీఆర్ జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళ. అందుకని అంగీకరించా” అని చెప్పారు.