సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవర్ స్టార్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ ప్రకటనతోనే ఇది పవర్ పవన్ కళ్యాణ్ బయోపిక్ అంటూ సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగింది. వర్మ ని పవన్ కళ్యాణ్ అభిమానులు దూషించడం…వాటికి వర్మ కౌంటర్లు ఇలా చాలా చర్చే జరిగింది. దానికి తోడు వర్మ అచ్చం పవన్ కళ్యాణ్ రూపం కలిగిన ఓ కుర్రాడి వీడియోను కూడా రిలీజ్ చేసాడు. దీంతో వర్మ అతన్ని ఎక్కడ పట్టుకున్నాడంటూ సందేహాలు వ్యక్తం అయ్యాయి. వర్మ బయోపిక్ లు తెరకెక్కిస్తే అందులో పాత్రలు కూడా వాస్తవ పాత్రలకు చాలా దగ్గరగా ఉంటాయి.
అచ్చం వాస్తవ రూపం కలిగిన వ్యక్తుల్నే వెతికి పట్టుకుంటాడు. ఆ విషయంలో వర్మ మహా దిట్ట. అప్పటి అజ్మల్ కసబ్ పాత్ర దగ్గర నుంచి మొన్నటి చంద్రబాబు నాయుడు డూప్ రోల్ వరకూ వర్మ చేసిన ప్రతీ బయోపిక్ లో పాత్రలు వాస్తవాలకి ప్రతిబిoబంలా నిలిచాయి. తాజాగా పవర్ స్టార్ టైటిల్ తో వస్తోన్న సినిమా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు జెరాక్స్ కాపీనే దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని వర్మ ఎక్కడ నుంచి దిగుమతి చేస్తున్నాడు? ఆ నటుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని ఇలా చాలా ప్రశ్నలు అభిమానులు సహా ప్రేక్షకుల్లో తలెత్తాయి. తాజాగా ఆ వివరాలు లీక్ అయ్యాయి.
అతని పేరు నరేష్. భద్రాచలంకు సమీపంలో సారపాక గ్రామానికి చెందిన కుర్రాడు. పవన్ కళ్యాణ్‌ని పోలిన రూపు రేఖలు కలిగి ఉండటంతో పవన్ ని అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు. ఈ వీడియోలు చూసి నరేష్ ని వర్మ కాంటాక్ట్ అయ్యాడుట. అతని వివరాలు సంపాదించి నరేష్ ని హైదరాబాద్ లో తన ఆఫీస్ కు పిలిపించాడుట వర్మ. ఇక పవన్ పాత్రలో నటించాలన్న నరేష్ డ్రీమ్ ని వర్మ 10 రోజుల్లో పూర్తిచేస్తానంటున్నాడు. అలాగే మరో ఆసక్తికర సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. పవర్ స్టార్ సినిమాని ఒకటి కాదు..రెండు భాగాలుగా తెరకెక్కిస్తారుట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.