ఆ ధైర్యం ఏంటో : బాలకృష్ణపై పోటీకి టీవీ యాంకర్

ఈ మధ్యకాలంలో బాల‌కృష్ణ ఎవ‌రో తెలియ‌దంటూ మీడియాలో వైర‌ల్ అయిన కేఏ పాల్ చివ‌ర‌కు బాల‌కృష్ణ నియోజ‌క‌వ‌ర్గం హిందూపురానికే త‌న పార్టీ నుంచి తొలి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. అది కూడా ఒక మ‌హిళా యాంక‌ర్‌ను ప్ర‌జా శాంతి పార్టీ త‌ర‌ఫున హిందూరం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇచ్చిన ఆఫర్‌ను టీవీ యాంకర్ శ్వేతారెడ్డి స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. పాల్ రూపంలో తనకు దక్కిన అదృష్టంపై శ్వేతారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, కానీ రాజకీయాల్లోకి రావాలన్న తన కల ఇలా నెరవేరబోతోందంటూ పాల్ ఆఫర్‌ను స్వీకరించారు.

అయితే బాల‌య్య చ‌రిష్మా ఈ భామ త‌ట్టుకోగ‌ల‌దా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. కానీ బాల‌కృష్ణ‌ను ఓడించి ఏపీ అసెంబ్లీలోకి శ్వేతారెడ్డి అడుగుపెడుతుంద‌ని కేఏ పాల్ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఎందుకంటే హిందూపురంలో బాల‌య్య ఎలాంటి అభివృద్ధి చేయ‌లేద‌ని, దీంతో అక్క‌డి ప్ర‌జ‌ల్లో బాల‌య్య పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని దీంతో అక్క‌డ ఎవ‌రిని నిల‌బెట్టిన గెలుస్తార‌ని, అయితే తాము మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ను బ‌రిలోకి దించుతున్నామ‌ని, ఇక్క‌డ చంద్ర‌బాబు ఎన్నికోట్లు ఖ‌ర్చుపెట్టినా బాల‌య్య‌ను ఓడిస్తామ‌ని కేఏపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవల పాల్ నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ టికెట్ కోసం ఎంత డబ్బు తీసుకుంటారని పాల్‌ను శ్వేతారెడ్డి ప్రశ్నించారు. శ్వేతారెడ్డి ప్రశ్నకు పాల్ బదులిస్తూ.. ఒక్క రూపాయి కూడా తీసుకోబోనని, అవసరమైతే మీరు కూడా రావొచ్చంటూ ఆహ్వానించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నా టికెట్ ఇస్తానంటూ బంపరాఫర్ ఇచ్చారు.

పాల్ ఆఫర్‌తో తొలుత ఆశ్చర్యపోయిన శ్వేతారెడ్డి తర్వాత ఆనందంలో మునిగిపోయారు. తనకు రాజకీయాలంటే ఎంతో ఇష్టమని, జర్నలిస్టుగా తనకు చాలా అనుభవం ఉందని శ్వేత పేర్కొన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలన్న ఆలోచన ఉన్నా డబ్బులు అడుగుతారన్న ఉద్దేశంతో తన కోరికను చంపుకున్నానని శ్వేత తెలిపారు. ఇప్పుడు కేఏ పాల్ రూపంలో ఆ అవకాశం వచ్చిందని సంబరపడ్డారు. రాజకీయాలే తన చివరి గమ్యమని పేర్కొన్నారు.