చిక్కుల్లో టాలీవుడ్.. వ‌డ్డీలు వ‌ద‌ల‌మ‌న్న‌ ఫైనాన్షియ‌ర్స్

tollywood
                             ఫైనాన్షియ‌ర్ల‌కు ముకుతాడు వేసే ప్లాన్‌లో గిల్డ్

చాలా మంది చిత్రనిర్మాతలు సినిమాలు పూర్తి చేయడానికి ఫైనాన్షియర్ల నుండి రుణాలు తీసుకుంటారు. సినిమాను త్వరితగతిన చుట్టేసి సకాలంలో ప్ర‌క‌టించిన‌ విడుదల తేదీకి వ‌చ్చేస్తే అది అన‌వ‌స‌ర భారం కాదు.

కానీ కరోనావైరస్ వ్యాప్తి క‌ల్లోలం సృష్టించింది. అన్ని చిత్రాల రిలీజ్ లు ఆలస్యమ‌య్యేందుకు కార‌ణ‌మైంది.  మొత్తం చిత్ర పరిశ్రమ మూసేయాల్సి వ‌చ్చింది.  నిర్మాతలు తమకు ఫైనాన్షియర్ల నుండి ఉపశమనం లభిస్తుందని .. ఈ 3-4 నెలల వడ్డీని చెల్లించకుండా మినహాయింపు ద‌క్కుతుంద‌ని భావించారు. కానీ మినహాయింపులు లేదా డిస్కౌంట్లు ఉండవని ఫైనాన్షియర్లు స్పష్టం చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగింద‌ట‌.

నిర్మాతలు- ఫైనాన్షియ‌ర్లు ఒక‌ ఉమ్మడి స‌మావేశంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుని నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులకు సాయ‌ప‌డాల‌న్న‌ది ప్ర‌ణాళిక‌. అంద‌రికీ ఒక‌టే రూల్ అన్న‌ట్టు ఒకే విధంగా అమలు చేయడానికి గిల్డ్ నిర్మాత‌లు ప్రణాళికలు వేస్తున్నారు. నిర్మాతల గిల్డ్ తాజా చర్యతో, ఫైనాన్షియర్లు కొత్తగా నిర్మాత‌ల‌కు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. నిర్మాతలు- ఫైనాన్షియర్లు గిల్డ్ అనే కొంద‌రు పెద్ద‌ల వ‌ద్ద త‌ల తాక‌ట్టు పెట్టిన‌ట్టే అయ్యిందన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఫైనాన్షియర్లు ఎలాగైనా వ‌డ్డీలు మొత్తాన్ని తిరిగి పొందాల‌న్న తాప‌త్ర‌యంతో ఉన్నారు. లేదా ఎక్కువ మొత్తాలకు రుణాలు ఇచ్చే ముందు “ఈ క‌ష్ఠ‌కాలంలోని నెలలకు వడ్డీలను చెల్లించడం“ గురించి హామీని పొందాల‌ని భావిస్తున్నార‌ట‌. షూటింగుల‌కు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చేశాయి కాబ‌ట్టి చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నందున తెలుగు సినిమా నిర్మాతలు- ఫైనాన్షియర్లు ఈ సమస్యను త్వరగా ఎలా పరిష్కరించుకుంటారు అన్న‌దానిపై స‌రైన స్ప‌ష్ఠ‌త లేదు.