ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులిచ్చాక ఎన్ని సినిమాలు సెట్స్ కెళ్లాయి? అంటే సరైన క్లారిటీ లేదు. సీరియల్ షూటింగులు జరుగుతున్నా కానీ సినిమాలేవీ సెట్స్ కెళ్లలేదనే అనుకున్నారంతా. కానీ తాజా సమాచారం ప్రకారం.. కొద్దిరోజుల్లో పూర్తయ్యే.. చివరి షెడ్యూల్ మాత్రం పూర్తి చేయాల్సిన వాళ్లంతా సెట్స్ కి వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దాదాపు ఓ 20 చిన్న మధ్యస్థ సినిమాలు సెట్స్ లో ఉన్నాయిట. మాస్ మహారాజా రవితేజ క్రాక్ చివరి అంకం షూటింగ్ జరుగుతోందని సమాచారం. అలాగే అల్లరి నరేష్ నాంది ఆన్ సెట్స్ శరవేగంగా పూర్తవుతోంది. అది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న బ్లాక్ చిత్రీకరణ పూర్తవుతోంది. వీరు కె- తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ కూడా సెట్స్ పై ఉందని సమాచారం. ఇవేగాక పెండింగ్స్ చిన్నవే అనుకున్నవన్నీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. నేడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా ఫాంటమ్ చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైన సంగతి విధితమే.
అయితే పెద్ద హీరోల సినిమాలేవీ షూటింగ్ జరగటం లేదు. స్టార్ హీరోలు ఎవరూ కొవిడ్ మహమ్మారీ ఉధృతి తగ్గితే కానీ సెట్స్ కి రాలేమని చెప్పేశారట. చిరంజీవి- రామ్ చరణ్- ఎన్టీఆర్- మహేష్ సహా పలువురు స్టార్లు సెట్స్ కెళ్లేందుకు ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. సీరియల్ నటీనటులు కొవిడ్ భారిన పడడంతో కాస్త ఆచితూచి ఆలోచిస్తున్నారట.
ఇలాంటి కష్ట కాలంలో టాలీవుడ్ ని గిల్డ్ వాళ్లు నియంత్రిస్తున్నారని ఓ ప్రచారం సాగుతోంది. అయితే అదేమీ సాధ్యం కాదని ఓ నిర్మాత అన్నారు. టాలీవుడ్ షూటింగులేవీ నిర్మాతల గిల్డ్ నియంత్రణలో లేవ్. ఎప్పటికీ ఉండవని కూడా సదరు నిర్మాత వెల్లడిస్తున్నారు. గిల్డ్ లో ఉన్న ఆ 19 మంది నిర్మాతలు మాత్రం ఎప్పుడూ ఒకే మాట మీద వుంటారు. మిగతా వాళ్లంతా అంటే నిర్మాతల మండలి మెంబర్స్ ఎవరి దారి వారిదేనని ఓ నిర్మాత గుసగుసగా చెప్పుకొచ్చారు.