టాలీవుడ్ ని కంట్రోల్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఆర్గనైజేషన్?
టాలీవుడ్‌ని అన్ వాంటెడ్ మాఫియా చెప్పు చేతల్లోకి తీసుకుంటోందా? పరిశ్రమను అన్ని బిజినెస్ కోణాల్లో గుప్పిట్లో పెట్టుకునేందుకు ఒక సెక్షన్ ధనస్వాములంతా ఏకమై పట్టు బిగిస్తున్నారా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఇన్నాళ్లు సదరు ధనస్వాములు లేదా ఇండస్ట్రీ డాన్స్ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి చాలానే చేశారు. ఇది పైకి కనిపించని అన్ వాంటెడ్ మాఫియాగా రూపాంతరం చెందిందని.. అది ప్రస్తుతం సీరియస్ యాక్టివిటీ అండర్ ప్లే చేస్తోందన్న వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. ఇకపై పరిశ్రమకు అసలైన భజన మొదలైందని సరికొత్త సంకేతాలు అందుతున్నాయి. ఇన్నాళ్లు చిన్న సినిమాల నిర్మాతలు.. కొత్త వాళ్లు పరిశ్రమకు వచ్చి ఎంతో నలిగిపోయారు. ఇకముందు నలిగిపోవడంతో సరిపోదు. ఇండస్ట్రీని శాసించే ఒక సెక్షన్ మాఫియా తరహా మనుషుల ముందు తలవొంచి బూట్లు నాకాల్సిన పరిస్థితి కూడా తలెత్తనుందన్న ఆందోళనా వ్యక్తమవుతోంది.
ఇంతకాలం చిన్న సినిమాల రిలీజ్ లకు థియేటర్లు ఇవ్వకుండా నలిపేశారు. ఒకవేళ థియేటర్లు ఇస్తున్నాం అని కలరింగ్ ఇచ్చినా అంతగా ప్రాధాన్యత లేని ప్రైమ్ ఏరియా కాని చోట్ల కొందరికి థియేటర్లను విధిలించి సర్ధుబాటు చేస్తున్నాం కదా! అని కవర్ చేశారు. వ్యాపారంలో ఎత్తుగడ వేసే వాడిదే పై చేయిగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఎత్తులు వేసి చిత్తు చేసి సామ్రాజ్యాన్ని గుప్పిట పట్టే స్థాయికి ఈ మాఫియా ఎదిగిందన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు ఈ మాఫియా సామ్రాజ్యం చాలా కోణాల్లో పరిశ్రమను గుప్పిట పట్టనుందని తెలుస్తోంది. ఇకమీదట టాలీవుడ్ సినిమాల రిలీజుల్ని ఈ మాఫియా శాసించనుంది. రిలీజ్ తేదీ విషయంలో ఆ నలుగురు లేదా ఆ పది మంది మాత్రమే పెట్టుకున్న ఒక ఆర్గనైజేషన్ సరికొత్త చట్టాల్ని తయారు చేయబోతోందని వెల్లడైంది. ఇందులో తొలి అడుగుగా ఇటీవలే ఓ ఇద్దరు యువహీరోల సినిమాల రిలీజ్ తేదీల్ని సదరు మాఫియా ప్రభావితం చేసింది. ఒకేరోజు రిలీజైతే వచ్చే నష్టాల్ని భేరీజు వేస్తూ సర్ధుబాటు చేస్తున్నామని చెబుతున్నా.. దీని వెనక వేరే వేరే కథలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు యువహీరోల వరకూ సేఫ్. కానీ ఈ తరహా సర్ధుబాటు విధానం చాలా మంది నిర్మాతల పుట్టి ముంచే ఆస్కారం లేకపోలేదన్న వాదనా మొదలైంది.
టాలీవుడ్‌ని గుప్పిట్లో బంధించిన బందిపోట్లు!
ఇకపై టాలీవుడ్ లో అడుగు పెట్టే కొత్త నిర్మాతలు అయినా లేదా చిన్న నిర్మాతలు అయినా.. మాఫియా ముందు తల వొంచాల్సిందే. బూట్లు నాకి.. లేసులు కట్టి.. అయ్యా మా సినిమా రిలీజ్ కి వస్తోంది.. మీరు దయతలిచి ఓ అవకాశం ఇప్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను.. అంటూ వాళ్లను బతిమాలుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఎగ్జిబిషన్.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తమ గుత్తాధిపత్యాన్ని అడ్డు పెట్టుకుని రిలీజ్ తేదీలతో పాటు చాలా చాలా విషయాల్ని సదరు మాఫియా కంపెనీ గుప్పిట పట్టే పనిలో ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నిర్మాతల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.