మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు కాదు.. సగటు సినీ ప్రేక్షకుడికీ ఓ పండుగే. అలాంటిది కొరటాల శివ లాంటి మాస్ అండ్ కమర్షియల్ డైరెక్షన్‌లో చిరంజీవి అంటే ఇక అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ చిత్రం కోసం కొరటాల రెండేళ్లకు పైగా తన సమయాన్ని వృథా చేసుకున్నాడు. అనుకున్న సమయానికి ఏదీ పూర్తి కాకపోవడంతో కొరటాల స్క్రిప్ట్‌ను ఇంకా మెరుగులు దిద్దుతూ వచ్చాడు.
చివరకు అంతా బాగానే జరుగుతోందని అనుకునే సమయానికి కరోనా వచ్చింది. చిత్ర పరిశ్రమ మూత పడింది. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులే అవుతున్నా ఇంత వరకు ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వలేకపోయింది. సినిమా పేరు ఆచార్య అని చిరంజీవే నోరు జారాడు. ఇక దీంతో చిత్రయూనిట్ ఏమీ చేయలేక చేతులెత్తేసింది. హీరోయిన్, స్పెషల్ క్యారెక్టర్ కోసం ఇంకా వేట కొనసాగుతూనే ఉంది.
తాజాగా మెగా ఫ్యాన్స్‌ను సంతోషంలో మునిగితేలాలా ఓ అప్డేట్‌ను ప్రకటించారు. చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న సాయంత్రం నాలుగు గంటలకు చిరు 152 ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. అయితే ఈ పోస్టర్‌లో ఎర్ర కండువా.. ఎగరేసే పద్దతి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గుర్తుకురాకమానదు. ఇప్పటికే లీకైన పోస్టర్‌న బట్టి చిరంజీవి నక్సలైట్ పాత్రను పోషిస్తున్నాడని టాక్ వినిపించింది. ఇక తాజా పోస్టర్‌లోనూ అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.